ఎస్ఐఆర్ పక్రియను, విబి-జి రామ్ జి చట్టాన్ని వ్యతిరేకిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇదే అంశంపై తెలంగాణలో కాంగ్రెసుకున్న ఎనిమిది మందితో లోక్ సభ ఎంపీలను రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని బిజెపి శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకునేందుకు, రాహుల్ గాంధీకి దగ్గరై కాంగ్రెస్ హైకమాండ్ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆశతోనే సీఎం రేవంత్ రెడ్డి అదే పనిగా ఉపాధి హామీ పథకాన్ని “విబి-జి రామ్ జి” చట్టంగా బలోపేతం చేసిన కేంద్రాన్ని తప్పుపడుతున్నారని ఆయన విమర్శించారు.
కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారనే అదే తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి దారుణంగా ఓడిపోయిందని ఆయన గుర్తు చేశారు. బిజెపిని బ్రిటీష్ జనతా పార్టీ అనడానికి రేవంత్ రెడ్డికి సిగ్గుండాలని ఆయన మండిపడ్డారు. బిజెపి పేరులోనే భారతీయత ఉందని చెబుతూ కాంగ్రెస్ ను స్థాపించింది ఆంగ్లేయులని, కాంగ్రెస్ అనే పదంలో భారతీయత లేదని ఆయన ధ్వజమెత్తారు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాస్తా ఇపుడు ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ అయిందని అంటూ దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డినే స్వయంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలోనే కాంగ్రెస్ అంటేనే ముస్లింలు, ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అంటూ మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఓటర్ల జాబితాలో ప్రక్షాళన చేపడుతూ ప్రత్యేక సమగ్ర సమీక్ష(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని నిర్వహించడం దేశంలో నిత్యం జరిగే పక్రియే అని స్పష్టం చేశారు.
దేశంలో ఇప్పుడే మొదటిసారిగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదం అని ఆయన విమర్శించారు. ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఓట్ చోర్ అనే నినాదంతో హడావుడి చేసిన రాహుల్ గాంధీకి బిహార్ రాష్ట్ర ప్రజలు చెంప చెళ్లుమనిపించే తీర్పు ఇచ్చారని మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించిన ఇదే రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియను చేపడితే కూడా తప్పుపట్టడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం అని ఆయన స్పష్టం చేశారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ అమలుకు ముందు జరిగిన లోకసభ ఎన్నికల్లో బీహారులో బిజెపికి వచ్చిన ఓట్ల కంటే ఆ ప్రక్రియ అమలు తర్వాత వచ్చిన ఓట్లు స్వల్పంగా తగ్గాయని ఆయన గుర్తు చేశారు. అదే ఆర్జెడి కి స్వల్పంగా పెరిగాయని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో మరణించినవారివి, శాశ్వతంగా వలస వెళ్లినవారివి, డూప్లికేట్ కేటగిరీ వంటి కారణాలతోఓట్లు తొలగిస్తుంటే ప్రజలకు ఎలాంటి నష్టం కలుగుతోందో సీఎం రేవంత్ రెడ్డి వివరించాలని ఆయన సవాల్ చేశారు.
ఈ ప్రక్రియలో తొలగిస్తున్న ఓట్లు ఎవరివో సీఎం ప్రజలకు చెప్పాలని నిలదీశారు.ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీకి దమ్ముంటే ఈ అంశంపై ప్రజాతీర్పును కోరగలరా? తన రాయబరేలి ఎంపీ సీటుకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లగలరా? అని బీజేఎల్పీ నేత ప్రశ్నించారు. వికసిత్ భారత్ లక్ష్యాల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ తెచ్చిందని అసెంబ్లీలో మంత్రులు చెప్పారని పేర్కొంటూ మరిపుడు వికసిత్ భారత్ కాదు సంక్షోభ భారత్ అంటూ విమర్శించడం అర్ధరహితం కాదా? అని నిలదీశారు.

More Stories
ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి 352 ఎంపీ సీట్లు
గవర్నర్ ఫోన్ ట్యాప్ చేస్తున్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం
జెలెన్స్కీని శాంతి చర్చల కోసం మాస్కోకు ఆహ్వానించిన రష్యా