రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని గెలిపించండి

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని గెలిపించండి
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో, మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని, ప్రజలకు అభివృద్ధికి సరిగ్గా అవకాశం ఇవ్వాలని  బిజెపి  రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
 
మున్సిపాలిటీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, విద్యా సంస్థల సమస్యలు కావచ్చు, ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు కావచ్చు -ఈ అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య, బాధ్యతారహిత వైఖరికి వ్యతిరేకంగా పార్టీ గట్టిగా పోరాడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం భూములపై ఆధారపడే పనిచేస్తోందని,  ప్రభుత్వ భూములను అప్పనంగా అమ్మడం, కబ్జాకోరుగా మారడం జరిగిందని విమర్శించారు. 
 
అందుకే మన భూములు, విశ్వవిద్యాలయ భూములు జాగ్రత్తగా కాపాడుకోవాలని రావు పిలుపిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రమాదకర స్థాయికి తీసుకెళ్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొన్న అసెంబ్లీలో జరిగిందేమిటో ప్రజలందరూ గమనించారని చెబుతూ చెబుతూ అసెంబ్లీలో చర్చల కంటే ప్రజల ధనాన్ని, సమయాన్ని, మన సమయాన్ని వృథా చేశారని ధ్వజమెత్తారు.

భూముల కబ్జా, రైతు బంధు బంద్, విద్యార్థులకు నిరుద్యోగ భృతి, విద్యా సంస్థలకు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్పిటళ్లకు ఆరోగ్యశ్రీ బకాయిలు – ఈ అంశాల్లో దేనిపైనా చర్చింపలేదని ఆయన మండిపడ్డారు.  కాగా, గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో వరంగల్‌కు చేసిందేమీ లేదని,  హన్మకొండ, వరంగల్‌తో పాటు జిల్లా పరిధిలోని కార్పొరేషన్లకు కూడా ఏ విధమైన అభివృద్ధి పనులు జరగలేదని ధ్వజమెత్తారు.

 
బిజెపి తరఫున ఇక్కడి నుంచి ఒక్క ఎంపీ కూడా లేకపోయినా, కేంద్ర ప్రభుత్వం రూ. 2 వేల కోట్లతో వరంగల్ అభివృద్ధికి కృషి చేసిందని రావు తెలిపారు.  వరంగల్ సిటీ మాస్టర్ ప్లాన్ ప్రకారం వరంగల్‌లో రూ. 4 వేల కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి అసలు ఏ పని మొదలుపెట్టలేదని దుయ్యబట్టారు.  కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వరంగల్ అభివృద్ధి జరుగుతోందని,  రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒరిగిందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో ప్రసిద్ధ కాకతీయ విశ్వవిద్యాలయంలో సరిపడా ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేరని, అయితే ఈ యూనివర్సిటీ భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసి, భూములు అమ్ముకునేందుకు కుట్ర చేస్తున్నదని రావు ఆరోపించారు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 100 ఎకరాల భూమిని ఇండస్ట్రీలకు, రియల్ ఎస్టేట్ కోసం ఇచ్చే ప్రయత్నం చేసిందని ఆయన గుర్తు చేశారు. తాజాగా హైదరాబాద్ మౌలానా ఉర్దూ యూనివర్సిటీలో వేల కోట్ల విలువైన 50 ఎకరాల స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం స్వాధీనం చేసుకోవాలనుకుందని తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల నిధులు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించి కనీసం వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేదని బిజెపి నేత గుర్తు చేశారు. అదేవిధంగా, మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తిచేసి, హ్యాండ్ఓవర్ చేస్తే, ఇక్కడ బ్రహ్మాండమైన ఎయిర్ పోర్టు నిర్మాణం చేసుకోవచ్చని ఆయన సూచించారు.