ఇక్కడ బీజేపీ, అటు కాంగ్రెస్ తోపాటు, ఎన్సీపీతో కలిసి అంబర్ నాథ్ వికాస్ అఘాఢి పేరుతో ఒక కూటమిగా ఏర్పడినట్లు తెలుస్తోంది. దీని ద్వారా శివసేనకు చెక్ పెట్టేందుకు ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అలాగే అకోలా జిల్లాలోని అకోటా మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ, ఎంఐఎం పొత్తు పెట్టుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇలా రెండు చోట్ల బీజేపీ అటు కాంగ్రెస్, ఇటు ఎంఐంతో పొత్తు పెట్టుకోవడంపై శివసేన వంటి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
మున్సిపల్ సీట్లు దక్కించుకునేందుకు స్థానికంగా ప్రత్యర్థి పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై మహాయుతి కూటమి నేత, రాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా, పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఇలా పొత్తులు పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై పూర్తి వివరాలు సేకరించేందుకు పార్టీ నేతలకు ఆదేశాలిచ్చామని తెలిపారు.
“కాంగ్రెస్ లేదా ఏఐఎంఐఎంతో ఎలాంటి పొత్తును అంగీకరించబోమని నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను. ఏ స్థానిక నాయకుడైనా సొంతంగా అలాంటి నిర్ణయం తీసుకుంటే, అది క్రమశిక్షణారాహిత్యం అవుతుంది.వారిపై చర్యలు తీసుకుంటాము” అని ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ పొత్తులను రద్దు చేయడానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
థానే జిల్లా అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌ను దక్కించుకునేందుకు బీజేపీ-కాంగ్రెస్ జట్టు కట్టాయి. 27మంది కౌన్సిలర్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన శిందే సేనకు అధికారం దక్కకుండా చేసేందుకు బీజేపీ-కాంగ్రెస్-ఎన్సీపీ అంబర్‌నాథ్ వికాస్ అఘాడీ పేరిట కూటమిగా ఏర్పడ్డాయి. 60 స్థానాలున్న కౌన్సిల్‌లో మేయర్ పీఠం దక్కించుకోవడానికి 31మంది కౌన్సిలర్లు అవసరం కాగా బీజేపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు, 12 మంది కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన నలుగురు, ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కలిపి మొత్తం 32 మంది కూటమిలో చేరారు. దీంతో బీజేపీకి చెందిన తేజశ్రీ కరన్‌జులే అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నికయ్యారు.
35 స్థానాలున్న అకోట్ మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీ తరపున 11 మంది కౌన్సిలర్లు నెగ్గారు. దీంతో ఉద్ధవ్ థాకరే యూబీటీ, శిందే సేన, అజిత్ పవార్ ఎన్సీపీ, శరద్ పవార్ ఎన్సీపీలకు చెందిన కౌన్సిలర్లతో పాటు ఏఐఎంఐఎంకు చెందిన నలుగురు కౌన్సిలర్లతో కలిపి బిజెపి నేతలు అకోట్ వికాస్ మంచ్‌గా కూటమి ఏర్పాటు చేశారు. మొత్తం 25 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీజేపీకి చెందిన మాయా ధులే మేయర్‌గా ఎన్నికయ్యారు.
ఈ పరిణామంపై ఉద్ధవ్ ఆధ్వర్యంలోని శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. శివసేన ఎమ్మెల్యే డాక్టర్ బాలాజీ కినికార్ దీనిని “సంకీర్ణ ధర్మానికి” ద్రోహమని, “కాంగ్రెస్ ముక్త భారత్” అనే బీజేపీ జాతీయ నినాదానికి విరుద్ధమని అభివర్ణించారు. మరోవైపు ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేశారు. తమ పార్టీ కూటమిలో లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరోవంక, కాంగ్రెస్ పార్టీ అంబర్‌నాథ్ బ్లాక్‌లోని కాంగ్రెస్ నాయకత్వంపై చర్యలు తీసుకుంది. హైకమాండ్‌కు తెలియకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు అంబర్‌నాథ్ బ్లాక్ అధ్యక్షుడిని, గెలిచిన 12 మంది కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

More Stories
భారత్లో వీసా సేవలను నిలిపివేసిన బంగ్లాదేశ్
ఎస్ఐఆర్ పక్రియ, ఉపాధి చట్టంపై రేవంత్ ఎన్నికలకు వెళ్లగలరా?
అంతరిక్ష డేటా సెంటర్ల ఏర్పాటుపై ఇస్రో దృష్టి