ఏప్రిల్‌ 1 నుంచి తొలిదశ జనగణన ప్రారంభం

ఏప్రిల్‌ 1 నుంచి తొలిదశ జనగణన ప్రారంభం

దేశంలో తొలిసారిగా డిజిటల్‌ విధానంలో జరగనున్న జనగణనకు రంగం సిద్ధమైంది. దేశంలో జనగణన తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఇళ్ల వివరాలను సేకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.  ఈ సందర్భంగా ప్రతి రాష్ట్రానికి 30 రోజుల వ్యవధి ఉంటుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పదేళ్లకోసారి దేశవ్యాప్తంగా నిర్వహించే జన గణన 2021లో చేపట్టాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా దీనిని చేపట్టాలని నిర్ణయించిన కేంద్రం, రెండు దశల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.  తొలిదశలో హౌస్ లిస్టింగ్, గణన (2026 ఏప్రిల్‌-సెప్టెంబరు), రెండో దశలో జనాభా లెక్కల సేకరణ (2027 ఫిబ్రవరి- మార్చి 1)ను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది.

మొబైల్‌ యాప్‌ల ద్వారా జనాభా లెక్కల సమాచారాన్ని సేకరిస్తామని, స్వీయ గణనకు ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు, జనగణనతోపాటే కుల గణనను కూడా చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. అంతకుముందు యావత్‌ దేశంలోని ఇళ్ల వివరాలను ఎలా సేకరించాలి? ఇందుకోసం ఏ విధమైన మార్గదర్శకాలను అనుసరించాలి? మానవ వనరులను ఎలా మోహరించాలి? అనే దానిపై ప్రీ-టెస్ట్‌లో ముమ్మర కసరత్తు చేశారు.

పారదర్శకంగా ఇళ్ల వివరాల సేకరణకు అనుసరించాల్సిన మార్గాలపై అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, ఉప జిల్లాల స్థాయిలోని అధికార వర్గాలతో లోతుగా చర్చిలు నిర్వహించారు.  ఇళ్ల సమాచారాన్ని సేకరించడానికి లక్షలాది మానవ వనరులను మోహరించడంపైనా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశామని అధికార వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. డిసెంబరు ప్రారంభంలోనే ప్రీ-టెస్ట్‌ ముగిసిందని తెలిపాయి. దీన్ని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరినీ భారతదేశ రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌ మృత్యుంజయ్‌ కుమార్‌ నారాయణ్‌ అభినందించారని పేర్కొన్నాయి.

‘హౌస్ లిస్టింగ్, గణన’ కోసం ఏప్రిల్‌ నుంచి దేశంలోని ప్రతీ ఇంటిని క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా చేరుకోవాలి? ఇంటి యజమానులను ఏయే ప్రశ్నలు అడిగి, ఎలాంటి సమాచారం సేకరించాలి? మొబైల్‌ యాప్‌ను ఎలా వాడాలి? డిజిటల్‌గా సమాచారాన్ని నమోదు చేసే క్రమంలో ఉపయోగపడే భద్రతా ఫీచర్లు ఏమిటి? సిబ్బందిని రాష్ట్ర, జిల్లా, ఉప జిల్లా స్థాయుల్లో ఎలా వినియోగించాలి? అధికారులు ఎలా సమన్వయం చేసుకోవాలి? అనే అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఇటీవలే జరిగిన ప్రీ-టెస్ట్‌ ప్రక్రియ దోహదపడిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ప్రీ-టెస్ట్‌ సందర్భంగా చాలా అంశాలపై ఫీడ్‌బ్యాక్‌ను సేకరించారు. అన్ని స్థాయిల అధికారులు తమ ఫీడ్‌బ్యాక్‌ను ఇచ్చారు. వాటన్నింటిపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సెన్సస్‌ డైరెక్టర్ల సమక్షంలోనే సమీక్ష జరిగింది. అందరి నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు. హౌస్ లిస్టింగ్, గణన ముగిశాక రెండో విడత జనగణన ప్రారంభమవుతుంది. 

ఇందులో భాగంగా మనదేశంలోని మంచుమయ ప్రాంతాల్లో జనాభా లెక్కల ప్రక్రియను 2026 సెప్టెంబరు నుంచి అక్టోబరు 1 వరకు నిర్వహించనున్నారు. మంచుమయ ప్రాంతాల జాబితాలో జమ్ముకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు ఉన్నాయి. దేశంలోని అన్ని ఇతర ప్రాంతాల్లో జనగణన 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1 వరకు జరుగుతుంది.