పోలవరం ప్రాజెక్టులో 87 శాతం సివిల్ పనులుపూర్తి

పోలవరం ప్రాజెక్టులో 87 శాతం సివిల్ పనులుపూర్తి
పోలవరం ప్రాజెక్టులో 87 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని చెబుతూ గడువులోగా మిగిలిన పనులన్ని పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎడమ కాలువ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు సైతం నీరు వెళ్లేలా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 
 
బుధవారం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై ఉన్నతాధికారుల నుంచి ఆయన ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా జరుగుతున్న పనులపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నిర్వాసితుల పునరావాసంతోపాటు ఆర్ అండ్ ఆర్ పనులపై దృష్టి కేంద్రీకరించాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
 
గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని పేర్కొంటూ పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదని ఆయన తెలంగాణ ప్రభుత్వంకు హితవు చెప్పారు. సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చని, నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణను కోరారు.  ఆర్టీఎస్‌లో నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్‌నగర్‌కు ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. దేవాదుల, కల్వకుర్తి తానే ప్రారంభించానని తెలిపారు.
 
దేవాదులను మరింత ముందుకు తీసుకెళ్లండి … ఎవరు వద్దన్నారు ? అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గోదావరి నదికి ఎగువన దేవాదుల ప్రాజెక్టు ఉందని, దేవాదుల నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయని చెబుతూ. కిందకు వచ్చే నీళ్లకు మీరు అభ్యంతరం చెబితే ఏమైనా అర్థం ఉందా? అని ప్రశ్నించారు. దేవాదులకు తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు అని స్పష్టం చేశారు.
 
 నీళ్లు పొదుపు చేస్తే తెలంగాణకు కూడా లబ్ధి కలుగుతుందని, మిగిలిన నీరు సాగర్‌, శ్రీశైలంలో నిల్వ చేస్తే తెలంగాణ కూడా వాడుకోవచ్చునని ఆయన సూచించారు. కృష్ణా నదిలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన ప్రాజెక్టులు కడితే నష్టం అని చెప్పారు. కష్ణా డెల్టాను కాపాడి గోదావరిని అనుసంధానం చేసుకుంటే ఇబ్బంది ఉండదని తెలిపారు.
 
గత వైసిపి ప్రభుత్వం వల్లే ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఆరేడు ఏళ్లు ఆలస్యమైందని చంద్రబాబు ఆరోపించారు. ఐఐటీ హైదరాబాద్‌ నిపుణులు చెప్పాకే డయాఫ్రం వాల్‌ పాడైందని గత ప్రభుత్వంలోని వారికి తెలిసిందని చెప్పారు. భవిష్యత్తులో వచ్చే విపత్తులను దఅష్టిలో ఉంచుకొని కొత్త డయాఫ్రం వాల్‌ కడుతున్నామని, ఫిబ్రవరి 15 నాటికి డయాఫ్రం వాల్‌ పూర్తి చేస్తామని తెలిపారు.  రాయలసీమ ఎత్తిపోతలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారనీ, అనుమతులు లేని ప్రాజెక్టులు ప్రారంభించి రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు.