యూపీలో 2.8 కోట్ల ఓట్లు తొలగింపు

యూపీలో 2.8 కోట్ల ఓట్లు తొలగింపు
ఓటర్ల జాబితాకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పలు రాష్ట్రాల్లో సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. దీని ద్వారా అక్రమ ఓట్లను తొలగిస్తున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో చేపట్టిన సర్ నివేదిక ఆధారంగా ఓటర్ల జాబితాపై ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీని ప్రకారం యూపీలో 2.89 కోట్ల ఓట్లను తొలగించారు.
 
వీరిలో 46 లక్షల ఓట్లు మరణించినవారివి. మిగిలిన ఓట్లలో 2.17 కోట్ల మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. అలాగే 25.47 లక్షల మంది డూప్లికేట్ ఓట్లు కలిగి ఉన్నారు. యూపీలో తాజా జాబితా ప్రకారం 15,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నారు.  15.44 కోట్ల ఓటర్లున్న ఉత్తరప్రదేశ్‌లో మరణాలు, శాశ్వత వలసలు, బహుళ రిజిస్ట్రేషన్ల కారణాలతో 2.8 కోట్ల ఓటర్ల పేర్లను తొలగించినట్లు ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రధాన అధికారి నవదీప్‌ రిన్వా తెలిపారు.
ఈ ముసాయిదా జాబితా క్లెయిమ్‌లకు సంబంధించి ఫిబ్రవరి 6 వరకు ఇసి గడువునిచ్చింది.  యుపిలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ డిసెంబర్‌ 11 ముగించాలని నిర్ణయించినప్పటికీ.. పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించడం వల్ల మరో 15 రోజుపాలపాటు ఆ గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. తాజా జాబితాకు సంబంధించి అభ్యంతరాలున్నా తమ పేర్లు లిస్టులో లేకున్నా ఫిబ్రవరి 6 వరకు ఫిర్యాదుచేయవచ్చు.
 
ఫాం 7, 8లలో స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులు, పరిశీలన అనంతరం తుది జాబితాను మార్చి 6న విడుదల చేసే అవకాశం ఉంది. ఈ అంశాల్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నవదీప్ రిన్వా మంగళవారం వెల్లడించారు. ఈ జాబితాను రాష్ట్రంలోని పార్టీలకు పంపించనున్నట్లు ఆయన తెలిపారు.  యూపీలో గతంలో 15.44 కోట్ల ఓట్లు ఉండగా, తాజా ముసాయిదా ప్రకారం.. 12.56 కోట్ల మంది ఓటర్లు మాత్రమే ఉంటారు. అంటే దాదాపు 18.7 శాతం ఓట్లను తొలగించినట్లైంది.
ఇంతకుముందు సర్ ఆధారంగా తమిళనాడులో 15 శాతం, గుజరాత్ లో 14.5 శాతం ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది.  కేంద్ర ఎన్నికల సంఘం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత ఏడాది సర్ నిర్వహించింది. ఇక.. యూపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మరోవైపు సర్ పై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దొంగ ఓట్లను తొలగించే పేరుతో.. ఇండియా కూటమి గెలిచిని నియోజకవర్గాల్లోనే ఓట్లను ఎక్కువగా తొలగిస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.