వెనిజులాపై సాయుధ దురాక్రమణకు పాల్పడి, ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను కిడ్నాప్ చేయడం ద్వారా అమెరికా ప్రత్యేక బలగాలు అంతర్జాతీయ చట్టాలకు సంబంధించి ఒక ప్రమాదకరమైన ఆనవాయితీని ప్రవేశపెట్టాయని అమెరికా మిత్రపక్షాలతో సహా భద్రతా మండలి సభ్య దేశాలు తీవ్రంగా హెచ్చరించాయి. వెనిజులాపై అమెరికా ఆపరేషన్‌ను అటు శత్రు దేశాలతో పాటూ ఇటు మిత్రదేశాలు కూడా తీవ్రంగా నిరసించాయి.
వెనిజులాలో చోటు చేసుకున్న కల్లోల పరిణామాల నేపథ్యంలో భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై చర్చించాంటూ వెనిజులా, కొలంబియా అభ్యర్ధించిన నేపథ్యంలో సోమవారం మండలి సమావేశమైంది. అమెరికా చర్య నేరపూరితమైనదంటూ విస్తృతంగా విమర్శలు, ఖండనలు ఎదురయ్యాయి. ఐక్యరాజ్య సమితిలో వెనిజులా రాయబారి శామ్యూల్ మోంకడా అమెరికా ఆపరేషన్‌ను తీవ్రంగా ఖండించారు.
ఇది చట్టవిరుద్ధమైన సాయుధ దాడి అని వ్యాఖ్యానించారు. దీనికి ఎలాంటి చట్టపరమైన సమర్ధింపు లేదన్నారు. మండలిలో శాశ్వత సభ్య దేశాలైన రష్యా, చైనా సహా క్యూబా, కొలంబియాలు ఇవే వ్యాఖ్యలు చేశాయి. రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా మాట్లాడుతూ, తనకు తానుగా దోషులుగా ముద్ర వేయడానికి, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్ట నిబంధనలతో నిమిత్తం లేకుండా శిక్షలు అమలు చేయడానికి అమెరికా తనకు తానుగా సుప్రీం జడ్జిగా వ్యవహరించరాదని హితవు చెప్పారు.
ప్రధానంగా ఈ సమావేశంలో అమెరికా చర్యను విమర్శించిన దేశాల్లో సాంప్రదాయంగా ఆమెరికా మిత్రపక్షాలు మెక్సికో, డెన్మార్క్ వున్నాయి. ఈ రెండు దేశాలపై ఎప్పుడో ఒకప్పుడు సైనిక చర్య తప్పదంటూ గత ఏడాది కాలంగా ట్రంప్ బెదిరిస్తూనే వున్నారు. అమెరికా పట్ల ద్వంద్వ ప్రమాణాలు పాటించకుండా మండలి నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా వుందని మెక్సికో రాయబారి హెక్టార్ వాస్కోన్సెలోస్ చెప్పారు.
సరిహద్దుల ఉల్లంఘన అనేది చర్చలకు అతీతమైన అంశమని డెన్మార్క్ రాయబారి క్రిస్టినా మార్కస్ లాసెన్ సమావేశంలో పేర్కొన్నారు. డెన్మార్క్ స్వయంపాలిత ప్రాంతమైన గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఆక్రమించుకుంటుందని ట్రంప్ బెదిరింపులను ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బలప్రయోగంతో కాకుండా శాంతియుతంగా వివాదాలను పరిష్కరించుకోవాలన్న సిద్ధాంతానికి అమెరికా చర్య పూర్తి విరుద్ధంగా వుందని ఫ్రాన్స్ విమర్శించింది.
కాగా లాత్వియా, బ్రిటన్ ప్రతినిధులు వెనిజులాలో తాజాగా నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడారు. అమెరికా రాయబారి మైక్ వాల్ట్స్ మాట్లాడుతూ అమెరికా న్యాయ వ్యవస్థ నుండి పారిపోయిన ఇద్దరు నిందితులపై అమెరికా మిలటరీ అమలు చేసిన లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆపరేషన్ అని చెప్పుకున్నారు.

More Stories
ఉక్రెయిన్‌కు భద్రతకై అమెరికా, మిత్రదేశాల భరోసా
ట్రంప్ ను వెంటాడుతున్న అభిశంసన భయం
బంగ్లాదేశ్ భారత్ లో ఆడాల్సిందే