వరంగల్ కోట భూముల్లో అక్రమ నిర్మాణాలపై రేవంత్ కు కిషన్ లేఖ!

వరంగల్ కోట భూముల్లో అక్రమ నిర్మాణాలపై రేవంత్ కు కిషన్ లేఖ!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని వరంగల్ కోట పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి, వాటిని తొలగించడం, ఆక్రమణకు గురైన కోట భూములను ఆక్రమణదారుల నుంచి విడిపించి తిరిగి సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కు స్వాధీనం  చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయనకు వ్రాసిన ఓ లేఖలో  ఆక్రమణదారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని, భారత పురావస్తుశాఖ చట్టం ప్రకారం, వరంగల్ కోట భూములను ఏఎస్ఐకి చెందినవిగా గుర్తించి రెవెన్యూ రికార్డులను సరిదిద్ది భూ ఆక్రమణ సమస్య పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేయారు. 
 
చారిత్రక, వారసత్వ సంపద పరిరక్షణలో ఏఎస్ఐకి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రిని కోరారు. దాదాపు 250 సంవత్సరాలపాటు కాకతీయుల రాజధానిగా కీర్తిగడించి ఘనమైన చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక వైభవంతో అలరారిన ఓరుగల్లు (వరంగల్)లో ఇతర రాజ్యాల నుంచి ఎదురయ్యే దండయాత్రల నుంచి రాజధానికి రక్షణ కల్పించటం కోసం ఒక ప్రణాళిక ప్రకారం 7 ప్రాకారాలతో వరంగల్ కోటను ఎంతో పకడ్బందీగా నిర్మించారని ఆయన గుర్తు చేశారు.
 
 ప్రతి రోజూ వేలాదిమంది పర్యాటకులు ఈ కోటను సందర్శించి కోటలో దాగి ఉన్న శిల్ప సంపద, నిర్మాణ నైపుణ్యం, వందలాది ఆలయాలు, వాటి నేపథ్యం, కోట ప్రాధాన్యం గురించి తెలుసుకుంటుంటారని తెలిపారు.  పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సౌండ్, ఇల్యూమినేషన్ లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు.  ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పర్యవేక్షణలో ఉన్న వరంగల్ కోట పరిరక్షణకు, నిర్మాణాల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
 
అయితే, ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ వరంగల్ కోటకు చుట్టూ ఉన్న 7 ప్రాకారాలలో ప్రస్తుతం 3 ప్రాకారాలు మాత్రమే మిగిలున్నాయని, వీటితో పాటు ఇతర ప్రాకారాలను కొంతమంది స్థానికులు ఆక్రమించి కోట భూములలో అనేక అక్రమ కట్టడాలు నిర్మించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ కోట ఏఎస్ఐ అధీనంలో ఉన్న ఒక స్మారక ప్రదేశమని, దీనికి సంబంధించిన భూములను ఆక్రమించడం, అందులో అక్రమంగా నిర్మాణాలను నిర్మించడం చట్టరీత్యా నేరమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 
 
వెంటనే ఆక్రమించిన భూములను ఖాళీ చేయాలని కోరుతూ ఏఎస్ఐ అధికారులు ఆక్రమణదారులకు పలుమార్లు నోటీసులు ఇచ్చారని, గతంలో తాను కేంద్ర  సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఏఎస్ఐ అధికారులకు, ఇటీవల వరంగల్ జిల్లా కలెక్టరుకు పలుమార్లు లేఖలు రాసినప్పటికీ అక్రమ నిర్మాణాలను తొలగించి, కోట భూములను పరిరక్షించటానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
 
అంతేకాకుండా, రెవెన్యూ రికార్డులలో కోట భూములను భారత పురావస్తుశాఖకు చెందినవి అని కాకుండా ప్రభుత్వం అని పేర్కొనడంతో  ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడంలో భారత పురావస్తుశాఖకు అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు.  ఈ ఆక్రమణలు మరింత పెరగకుండా, కోట భూములు భారత పురావస్తుశాఖకు చెందినవిగా గుర్తించడం కోసం ఏఎస్ఐ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో కోట భూములను పరిశీలించాలని సంబంధిత అధికారులకు తగిన మార్గదర్శకాలను విడుదల చేయాలని కోరుతూ ఏఎస్ఐ ఇటీవల జిల్లా కలెక్టరుకు లేఖ రాసిందని ఆయన తెలిపారు.
 
వరంగల్ కోటకు చుట్టూ మట్టి గోడ, రాతి గోడ ఉన్నాయి. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కొత్త నిర్మాణాలను చేపట్టడానికి వీలుగా ఇటీవల మట్టి గోడలోని కొంత భాగాన్ని ఆక్రమించారని చెప్పారు. వారసత్వ ప్రదేశాలను ధ్వంసం చేసి, వరంగల్ కోట భూముల్లో చట్టవిరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను గుర్తించడంలో తగిన సహకారాన్ని అందించి, పురావస్తు శాఖ చట్టం ప్రకారం ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఎస్ఐ అధికారులు ఇటీవల జిల్లా కలెక్టరుకు మరో లేఖ రాసినట్లు తెలిపారు.