దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం దగ్గర ఉన్న సయ్యద్ ఫయాజ్ ఇలాహీ మసీదు వద్ద బుధవారం ఉదయం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మసీదు ఆవరణలో ఆక్రమణలను కూల్చివేసేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులు, పోలీస్ బృందాలపై 25-30 మంది స్థానికులు రాళ్లు విసిరారు. దాంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టిన క్రమంలో 100 నుంచి 150 మంది ఆందోళనకారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వారిలో చాలా మంది అధికారులు నచ్చజెప్పడంతో వెనుదిరిగారు. అయితే కొందరు మాత్రం రాళ్ల దాడికి తెగబడ్డారు. ఆ గుంపును చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. గాయపడ్డ పోలీసులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మసీదు సమీపంలోని వంటశాల, డిస్పెన్సరీని ఆక్రమణలుగా న్యాయస్థానం ప్రకటించిందని వివరించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించినట్లు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు పోలీసులపై దాడి చేయడంపై ఢిల్లీ హోంమంత్రి ఆశీశ్ సూద్ తీవ్రంగా ఖండించారు. “మసీద్ ప్రాంగంణంలో వాణిజ్య భవనాలు నిర్మించడం నిబంధనలకు విరుద్ధమని కోర్టు చెప్పింది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ చర్యను అడ్డుకోవడం సరైంది కాదు. ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.” అని చెప్పారు.

More Stories
వీసాలపై భారతీయ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక
వైష్ణోదేవి సంస్థ మెడికల్ సీట్ల అనుమతి రద్దు!
31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు