పరకామణి కేసులో పొలిసు అధికారులపై క్రిమినల్ కేసులు

పరకామణి కేసులో పొలిసు అధికారులపై క్రిమినల్ కేసులు
టీటీడీ పరకామణి కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సీఐడీ, ఏసీబీని ఆదేశించింది. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలివ్వాలని హైకోర్టు తెలిపింది.  నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సీఐడీ నివేదికలో స్పష్టంగా ఉందని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
సీఐడీ, ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. తిరుమల పరకామణిలో కానుకల లెక్కింపు విషయంలో సమర్పించిన నివేదికపై తిరుమల తిరుపతి దేవస్థానంను హైకోర్టు మంగళవారం కొన్ని ప్రశ్నలు అడిగింది. లెక్కింపునకు లుంగీలతో వచ్చే బదులుగా ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రస్తావించలేదని ప్రస్తావించింది. 

కానుకల లెక్కింపునకు టేబుళ్ల ఏర్పాటుపై వివరాలు లేవని పేర్కొంది. ఈవోతో చర్చించి వివరాలు కోర్టు ముందు ఉంచుతామని టీటీడీ తరఫు న్యాయవాది తెలిపారు. కేసులో ప్రమేయం ఉన్నవారిపై శాఖాపరమైన చర్యలు అవసరమని హైకోర్టు వ్యాఖ్యానించింది.

గత ప్రభుత్వ హయాంలో తిరుమల పరకామణిలో నగదు చోరీ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు వైరలయ్యాయి. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కేసులో కీలకమైన టీటీడీ మాజీ ఎస్‌వీఓ అధికారి విచారణకు వస్తూ అనుమానాస్పద రీతిలో మరణించారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.