తమిళనాట ‘ఇండియా’ కూటమిలో బీటలు… విజయ్ వైపు కాంగ్రెస్!

తమిళనాట ‘ఇండియా’ కూటమిలో బీటలు… విజయ్ వైపు కాంగ్రెస్!

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నతమిళనాడులో  రాష్ట్రాన్ని పాలిస్తున్న డీఎంకే – కాంగ్రెస్ అధికార కూటమిలో బీటలువారే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత హీరో విజయ్‌‌తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సన్నిహితుడిగా పేరొందిన ప్రవీణ్ చక్రవర్తి భేటీ అయ్యాక పలు ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.  కాంగ్రెస్‌కు 38 అసెంబ్లీ సీట్లు, 3 మంత్రి పదవులు ఇస్తాను అనేలా హీరో విజయ్‌‌ ఆఫర్ ఇచ్చారనే చర్చ మొదలైంది.

ఓ వైపు అసెంబ్లీ సీట్ల పంపకాలపై డీఎంకే అధినేత స్టాలిన్‌తో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతుండగా, మరోవైపు విజయ్ ఆఫర్ తెరపైకి రావడం రాజకీయ రగడను రాజేసింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా డీఎంకే, కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య వాగ్యుద్దం జరిగింది. ‘ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కాలని ఆశిస్తుంది. అధికారంలో వాటాను ప్రతి పార్టీ కోరుకుంటుంది. ఒకవేళ అధికారమే వద్దు అనుకుంటే, ఎన్జీఓగా మారిపోవాల్సి ఉంటుంది’ అని కాంగ్రెస్ పార్టీ తమిళనాడు వ్యవహారాల ఇంఛార్జి గిరీశ్ ఛోడంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండియా కూటమిలో మంటలు రేపుతున్నాయి. 

గిరీశ్ ఛోడంకర్ చేసిన తాజా వ్యాఖ్యను బట్టి తమిళనాడు కాంగ్రెస్‌ వైఖరిలో వచ్చిన మార్పును అర్థం చేసుకోవచ్చు. మిత్రపక్షం డీఎంకే నుంచి తాము ఏమేం ఆశిస్తున్నామనే విషయాన్ని గిరీశ్ సూటిగా చెప్పేశారు. అధికారంలో వాటా అంటే మంత్రి పదవులు. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే – కాంగ్రెస్ సంకీర్ణ సర్కారే అధికారంలో ఉంది. 

రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ సీట్లు ఉండగా, గత ఎన్నికల్లో 173 స్థానాల్లో డీఎంకే, 25 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేశాయి. 133 సీట్లను డీఎంకే, 17 సీట్ల కాంగ్రెస్ గెల్చుకున్నాయి. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా కాంగ్రెస్‌ ఉన్నా, ఒక్క మంత్రి పదవిని కూడా హస్తం పార్టీకి కేటాయించలేదు. ఈ అంశాన్ని టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్‌ గుర్తించారు. 

2025 డిసెంబరు 5న తనతో భేటీ అయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సన్నిహితుడు ప్రవీణ్ చక్రవర్తికి ఆయన బిగ్ ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తుకు సిద్ధమైతే కాంగ్రెస్‌కు 38 అసెంబ్లీ సీట్లు, 3 మంత్రి పదవులు ఇస్తానని ప్రవీణ్‌కు విజయ్ చెప్పారంటూ తమిళనాడు మీడియాలో సంచలన కథనాలు వచ్చాయి.

హీరో విజయ్ ఇచ్చిన ఆఫర్‌కు అంగీకరించి టీవీకేతో చేతులు కలపడం మంచిదనే అభిప్రాయం పలువురు కాంగ్రెస్ శ్రేణులలో వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంలో అధికార భాగస్వామ్యాన్ని బలంగా కోరుకుంటున్నారని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఇంఛార్జి క్రిష్ సోదంకర్ పేర్కొన్నారు.

 అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ఈ తరుణం అధికార భాగస్వామ్యం గురించి చర్చించాల్సిన టైం కాదా? అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు. కూటమి లేకుండా తమిళనాడులో ఏ పార్టీ కూడా ఎన్నికల్లో గెలవలేదని స్పష్టం చేశారు. మాణిక్కం ఠాగూర్ ట్వీట్‌‌పై ఎక్స్ వేదికగా అధికార డీఎంకే పార్టీ మాజీ ఎంపీ ఎంఎం అబ్దుల్లా స్పందించారు. 

డీఎంకే సర్కారుకు మిత్రపక్షాల మద్దతు కొనసాగుతుందా? లేదా? అనే అంశంపై గత ఏడాది కాలంగా పలు సోషల్ మీడియా పేజీల్లో ఆర్ఎస్ఎస్ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ కథనాలు ఎక్కడ పుట్టాయి? ఎవరి ద్వారా పుట్టాయి ? అనేది తెలుసుకోకుండా మాణిక్కం ఠాగూర్ స్పందిస్తున్నారని ఎంఎం అబ్దుల్లా వ్యాఖ్యానించారు. 

డీఎంకే – కాంగ్రెస్ కూటమి కార్యకర్తలలో గందరగోళం సృష్టించడానికి, ఐక్యతను దెబ్బతీసేందుకు ఆర్‌ఎస్ఎస్ సృష్టించిన ఈ కాలం చెల్లిన కథనంలోని అంశాలతో మాణిక్కం ఠాగూర్ మాట్లాడటం ఎవరి ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది అని అబ్దుల్లా ప్రశ్నించారు.

తాజాగా జనవరి 3న టీవీకే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్  లౌకికవాద సూత్రాల ప్రకారం తమకు కాంగ్రెస్ పార్టీ సహజ భాగస్వామి అని వెల్లడించడం ద్వారా కాంగ్రెస్‌తో సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నామనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. తమిళనాడులోని దళిత, మైనారిటీవర్గాల్లో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. టీవీకేకు కూడా ఆ వర్గాలతో పాటు యువత, మహిళల్లో మాస్ ఫాలోయింగ్ ఉంది. తమతో కాంగ్రెస్ చేతులు కలిపితే సులభంగా పెద్దసంఖ్యలో సీట్లను గెలవొచ్చనే ఆశాభావంతో టీవీకే ఉంది.