బంగ్లాదేశ్ లో పారిపోతూ మరో హిందువు మృతి

బంగ్లాదేశ్ లో పారిపోతూ మరో హిందువు మృతి
బంగ్లాదేశ్ లో మరో హిందువు మరణించాడు. స్థానికులు దాడికి ప్రయత్నిస్తుండగా పారిపోతూ ఒక కాలువలో దూకి, ప్రాణాలు కోల్పోయాడు. నౌగావో జిల్లాలోని, మొహదేవపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని 25 ఏళ్ల మిథున్ సర్కార్ గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిథున్ సర్కార్ ను చోరీ చేశాడనే నెపంతో స్థానికులు గుంపుగా వెంటాడి పట్టుకునేందుకు ప్రయత్నించారు. 

ఈ క్రమంలో మిథున్ పారిపోతూ పక్కనే ఉన్న కాలువలో దూకి రక్షించుకోవాలనుకున్నాడు. కానీ, కాలువలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడి మృతదేహాన్ని ఫైర్ సిబ్బంది సహాయంతో బయటకు తీసి, శవ పరీక్ష నిమిత్తం తరలించారు.

“దొంగతనం చేశాడని ఆరోపిస్తూ ఒక గుంపు అతడిని వెంబడించింది. అతను నీటిలోకి దూకాడు, దూకిన తర్వాత మరణించాడు. పోలీసులకు సమాచారం అందించగా, వారు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో అతని మృతదేహాన్ని వెలికితీశారు. మేము శవపరీక్ష నిర్వహిస్తూ, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాము,” అని నౌగావ్ పోలీస్ సూపరింటెండెంట్ మహమ్మద్ తారిఖుల్ ఇస్లాం తెలిపారు.

ఇటీవలి కాలంలో బంగ్లాలో హిందువులు సహా మైనారిటీలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.  గత ఏడాది డిసెంబర్‌లో ప్రముఖ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ మరణం తర్వాత అశాంతి నెలకొన్న బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న వరుస దాడుల మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది. దీపు చంద్రదాస్, ఖోకోన్ చంద్ర దాస్, మణి చక్రవర్తి వంటి పలువురు హిందువులపై అక్కడి మూకలు దాడిచేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. 2022 లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ లో 13.1 మిలియన్ల హిందువులున్నారు. అంటే అక్కడి జనాభాలో 7.9 శాతం.