కొత్త `ఉపాధి’ చట్టంపై ప్రతిపక్షాల కుట్రలను పటాపంచలు చేయాలి

కొత్త `ఉపాధి’ చట్టంపై ప్రతిపక్షాల కుట్రలను పటాపంచలు చేయాలి
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉపాధి హామీతో పాటు జీవనోపాధిని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) – విబి-జి రామ్ జి చట్టం, 2025కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల కుట్రలను పటాపంచలు చేయాలని పార్టీ శ్రేణులకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు పిలుపిచ్చారు.
 
రాష్ట్ర పదాధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండించారు.  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను మరింత ఆధునికీకరించి, కొత్త అవసరాలకు అనుగుణంగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.
 
ప్రధాని మోదీని, బిజెపిని విమర్శించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేయడంతో పాటు, ఈ చట్టంపై అవాస్తవాలను వ్యాప్తి చేస్తూ ప్రజల్లో అపోహలు, అపార్థాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా తిప్పికొట్టాలని రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు
 
ప్రతి పేదవాడికి ఉపాధి, ఉపాధితో పాటు గౌరవం అనే ఆలోచనతో తీసుకొచ్చిన ఈ చట్టం వికసిత్ భారత్ @2047 జాతీయ విజన్‌కు అనుగుణంగా గ్రామీణ అభివృద్ధికి కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుందని ఆయన తెలిపారు. కొత్త చట్టం ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 125 రోజుల ఉపాధి హామీ లభించడంతో పాటు వారం వారం వేతనాల చెల్లింపు, వేగవంతమైన చెల్లింపులు అమలవుతాయని ఆయన తెలిపారు.

ఈ కొత్త చట్టం ద్వారా నీటి వనరుల అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల నిర్మాణం, జీవనోపాధి మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని,, గ్రామ ఆదాయం పెరుగుతుందని ఆయన చెప్పారు. వ్యవసాయ సీజన్‌లో కార్మికుల కొరత రాకుండా 60 రోజుల వర్క్ స్టాప్ వెసులుబాటు కూడా ఈ చట్టంలో తీసుకురావడం జరిగిందని పేర్కొంటూ ప్రజలకు వాస్తవాలు తెలియచెప్పాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.