అమెరికా ప్రత్యేక దళాలు వెనెజువెలా రాజధాని కారకాస్ నుంచి అపహరించిన అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికా న్యాయస్థానంలో తొలిసారి హాజరయ్యారు. న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో సోమవారం జరిగిన విచారణలో తాను నిర్దోషినని, గౌరవనీయమైన వ్యక్తినని, తనను అపహరించారని మదురో వ్యాఖ్యానించారు. అమెరికా దాడి తర్వాత ఆయన చేసిన తొలి బహిరంగ వ్యాఖ్యలివి.
అమెరికా ఆరోపిస్తున్న “నార్కో-టెర్రరిజం” కేసులకు సంబంధించి మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌తో కలిసి కోర్టు ముందు హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు) యుఎస్ జిల్లా న్యాయమూర్తి అల్విన్ కే. హెలర్‌స్టీన్ ఎదుట విచారణ జరిగింది. ఇది సుదీర్ఘ న్యాయపోరాటానికి ఆరంభంగా భావిస్తున్నారు.
నీలిరంగు జైలు దుస్తులు ధరించి, చేతులకు బేడీలు వేసిన స్థితిలో భారీ భద్రత మధ్య మదురో, ఆయన భార్యను కోర్టులోకి తీసుకువచ్చారు. ఇంగ్లిష్‌లో జరిగిన విచారణను స్పానిష్‌లో వినేందుకు హెడ్‌సెట్లు ధరించారు. ఈ సందర్భంగా మదురో నేరాన్ని అంగీకరించకుండా, “నేను అపహరించబడ్డాను. నేను నిర్దోషిని. నా దేశానికి అధ్యక్షుడిని” అని న్యాయమూర్తికి తెలిపారు.
అమెరికా ఆరోపణల ప్రకారం, మదురో కుటుంబం డ్రగ్ కార్టెల్‌లతో కలిసి వేల టన్నుల కొకైన్ అక్రమ రవాణాకు సహకరించిందని పేర్కొంది. ఈ కేసులో దోషిగా తేలితే మదురోకు జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, అమెరికా జైలులో ఉన్న నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ విడుదలకు వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రొడ్రిగజ్ ఓ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అమెరికా సైన్యం మదురో దంపతులను అపహరించుకొని వెళ్లిన తర్వాత ఆమె తొలిసారిగా క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రొడ్రిగజ్ నియామకం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆమెకు హెచ్చరికలు పంపారు. అమెరికాతో సహకరించకుంటే మదురో కంటే ఎక్కువ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని బెదిరించారు.
మరోవైపు, స్విట్జర్లాండ్ ప్రభుత్వం మదురోకు సంబంధించిన స్విస్ ఆధారిత ఆస్తులన్నింటినీ తక్షణమే ఫ్రీజ్ చేస్తున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది. మదురోకు లేదా ఆయనతో సంబంధం ఉన్న వ్యక్తులకు స్విట్జర్లాండ్‌లో ఉన్న ఆస్తులన్నింటినీ నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో జరిగే న్యాయ ప్రక్రియల్లో ఆ ఆస్తులు అక్రమంగా సంపాదించినవిగా తేలితే, అవి వెనిజువెలా ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ఇలా ఉండగా, సోమవారం నాడు వెనిజులా రాజధాని కారకాస్‌లో భారీ కాల్పులు, పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. వివిధ వార్తా సంస్థల ప్రకారం, వెనిజులాలోని అధ్యక్ష భవనంపై గుర్తు తెలియని డ్రోన్‌లు ఎగిరిన తర్వాత భద్రతా దళాలు కాల్పులు జరిపాయి.
అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. డ్రోన్ లేదా విమాన శబ్దాలు కూడా వినిపించినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే, ప్రస్తుతం ఏమి జరుగుతోందనే దానిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

More Stories
బంగ్లాదేశ్ లో పారిపోతూ మరో హిందువు మృతి
బిజెపి మహిళా కార్యకర్త దుస్తులు చింపేసిన కర్ణాటక పోలీస్!
వెనిజులాపై సాయుధ దురాక్రమణ ప్రమాదకర ఆనవాయితీ