దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీచేసిన తర్వాత ఇరాన్‌లో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ దేశం విడిచి పారిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఓ మీడియా సంచలన కథనాన్ని వెల్లడించింది.
దేశంలో అలజడి పెరిగిపోతే 20 మంది సన్నిహిత సహచరులు, కుటుంబ సభ్యులతో టెహ్రాన్ నుంచి పారిపోవడానికి ఖమేనీ సన్నాహాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలను ఉటంకిస్తూ ది టైమ్స్ పత్రిక కథనాన్ని రాసింది. 1979నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత ఎనిమిదేండ్లకు ఇరాన్ నుంచి పారిపోయిన మాజీ ఇజ్రాయెలీ నిఘా అధికారి బెనే సబ్తీని ఉటంకిస్తూ ఖమేనీ మాస్కోకు పారిపోవచ్చని, ఆయనకు ప్రపంచంలో తలదాచుకోవడానికి మరో దేశం ఏదీ లేదని టైమ్స్ తెలిపింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని ఆరాధించే ఖమేనీ రష్యా తమకు సాంస్కృతికంగా చాలా సన్నిహిత దేశమని ఇరాన్ సుప్రీం నాయకుడు భావిస్తారని సబ్తీ వెల్లడించినట్లు పత్రిక తెలిపింది. టెహ్రాన్‌తోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆదివారం వరుసగా 8వ రోజు కూడా ఖమేనీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. టెహ్రాన్‌లోని ప్రధాన బజారుతోపాటు ప్రధాన షాపింగ్ సెంటర్ల వద్ద భారీ స్థాయిలో భద్రతా దళాలను మోహరించారు.
నగరంలో అనేక దుకాణాలు మూతపడ్డాయి. సాధారణ దుస్తులు ధరించిన భద్రతా ఏజెంట్లు ప్రధాన వీధుల్లో నిఘా వేసి తిరుగుతున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ తెలిపింది. టెహ్రాన్‌లోని జోంహోరీ వీధిలో నిరసనలు తెలియచేస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.టెహ్రాన్‌కు పొరుగున ఉన్న నార్మక్, నజియాబాద్, హఫీజ్ స్ట్రీట్‌తోపాటు సెమ్నన్ ప్రావిన్సులోని సంగ్సర్, ఫార్స్ సర్‌లోని నూరాబాద్-ఇ మామసని వంటి అనేక నగరాలకు నిరసనలు విస్తరించాయి. దేశంలో దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితులపై ఆందోళన చెందుతూ ప్రజలు డిసెంబర్ 28న ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించడంతో దేశంలో అలజడి మొదలైంది.
నిరసనకారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపి హతమారిస్తే అమెరికా నుంచి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో తాజాగా ఖమేనీ పరారీపై ఊహాగానాలు జోరందుకున్నాయి. కాగా, ఇరాన్‌లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో టెహ్రాన్‌కు అత్యవసరం కాని ప్రయాణాలను మానుకోవాలని దేశ పౌరులకు భారత ప్రభుత్వం సూచించింది. తదుపరి ఆదేశాల వరకు ఇరాన్‌కు అనవసర ప్రయాణాలను నివారించుకోవాలని సూచించింది.
ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులు, భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండి నిరసనలు లేదా ప్రదర్శనలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, టెహ్రాన్‌లోని భారత ఎంబసీకి చెందిన వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిళ్లను నిశితంగా గమనిస్తూ ఉండాలని కేంద్రం పిలుపునిచ్చింది. రెసిడెంట్ వీసాలపై ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులు భారత ఎంబసీలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది.
More Stories
బంగ్లాదేశ్ లో పారిపోతూ మరో హిందువు మృతి
వెనిజులాపై సాయుధ దురాక్రమణ ప్రమాదకర ఆనవాయితీ
బంగ్లాదేశ్ లో జర్నలిస్టు హత్యపై దర్యాప్తు జరపాలి