బంగ్లాదేశ్ లో హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా హిందూ వితంతు మహిళ (40)పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆమెను చెట్టుకు కట్టేసి, జుట్టు కత్తిరించారు. ఈ ఘటన సెంట్రల్ బంగ్లాదేశ్ లోని, జెనైద్ జిల్లా, కాళిగంజ్ ప్రాంతంలో జరిగింది. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవంక, గత మూడు వారాలలో ఆరుగురు హిందువులను కాల్చి చంపారు. సోమవారమే ఇద్దరినీ హత్య చేశారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, కిరాణా వ్యాపారి అయిన మోని చక్రవర్తిపై రాత్రి 10 గంటల ప్రాంతంలో పదునైన ఆయుధాలతో దాడి జరిగింది. ఆ తర్వాత అతను తన గాయాల కారణంగా మరణించాడు. ఈ హత్యకు గల కారణం ఇంకా తెలియరాలేదు. డిసెంబర్ 19న, మోని ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ రాస్తూ, దేశంలో జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశాడని, తన స్వస్థలం “మృత్యులోయగా” మారిందని వర్ణించాడని సమాచారం.
బాధితురాలు కొంతకాలం క్రితం షహీన్ అనే వ్యక్తి నుంచి అక్కడ కొంత స్థలంతోపాటు, రెండంతస్తుల ఇంటిని కొనుగోలు చేసింది. అప్పటినుంచి షహీన్ ఆమెను పలురకాలుగా వేధించాడు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోపం తెచ్చుకున్న షహీన్, హసన్ అనే వ్యక్తితో కలిసి వచ్చి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే ఆమెను చెట్టుకు కట్టేసి, జుట్టు కత్తిరించారు.
ఈ ఘటనను వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు బాధితురాలి నుంచి డబ్బు కూడా డిమాండ్ చేశారు. డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమె బంధువులపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో బాధిత మహిళపై మరింతగా దాడి చేయడంతో ఆమె స్పృహ కోల్పోయింది. స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులకు ఆమె అత్యాచారం గురించి చెప్పలేదు. కానీ, వైద్యం అందిస్తున్న సమయంలో ఆమె అత్యాచారానికి గురైనట్లు గుర్తించారు.
బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ లో హిందువులు, మైనారిటీలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో దీపు చంద్రదాస్ ను దాడి చేసి చంపేయగా, మరో హిందూ ఖోకోన్ చంద్ర దాస్ పై దాడి చేయగా అతడు కూడా మరణించారు.
కాగా, సోమవారం మధ్యాహ్నం జెస్సోర్ జిల్లాలోని కోపాలియా బజార్‌లో రాణా ప్రతాప్ బైరాగి అనే హిందువును కొందరు దుండగులు కాల్చి చంపారు. బైరాగి అరుణ గ్రామానికి చెందినవాడు. ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అతను మార్కెట్‌లో ఉన్నప్పుడు కొందరు దుండగులు అతనిపై దాడి చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత దాడి చేసినవారు పారిపోగా, బైరాగి అక్కడికక్కడే మరణించాడు.
గత నెలలో హదీ మరణం తర్వాత ఉద్రిక్తంగా ఉన్న బంగ్లాదేశ్‌లో జరిగిన ఐదవ ఇలాంటి సంఘటన ఇది. మొదట, డిసెంబర్ 18న మైమెన్‌సింగ్‌లో ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేసే దీపు చంద్ర దాస్‌పై ఒక గుంపు దాడి చేసి కొట్టి చంపింది. ఈ సంఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత, పంగ్షా ఉపజిల్లాలో మత దూషణఆరోపణలపై అమృత్ మోండల్ అనే మరో హిందూ వ్యక్తిని గుంపు దాడి చేసి చంపింది. తరువాత, మైమెన్‌సింగ్‌లో బజేంద్ర బిస్వాస్‌ను కాల్చి చంపారు.
ఈ నెల ప్రారంభంలో, పని నుండి తిరిగి వస్తున్న 50 ఏళ్ల హిందూ వ్యాపారవేత్త ఖోకన్ దాస్‌పై కూడా ఒక గుంపు దాడి చేసి నిప్పంటించింది. కొన్ని రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన దాస్, శనివారం గాయాలతో మరణించాడు. గత నెలలో, బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం హయాంలో పొరుగు దేశంలో మైనారిటీలపై 2,900 కంటే ఎక్కువ దాడుల సంఘటనలు నమోదయ్యాయని తెలిపారు.

More Stories
బంగ్లాదేశ్ లో పారిపోతూ మరో హిందువు మృతి
బిజెపి మహిళా కార్యకర్త దుస్తులు చింపేసిన కర్ణాటక పోలీస్!
వెనిజులాపై సాయుధ దురాక్రమణ ప్రమాదకర ఆనవాయితీ