స్తంభంపై దీపం వెలిగించేందుకు హైకోర్టు అనుమతి

స్తంభంపై దీపం వెలిగించేందుకు హైకోర్టు అనుమతి
* స్టాలిన్ ప్రభుత్వానికి చుక్కెదురు
 
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మధురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై దీపం వెలిగించొచ్చు అంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా మద్రాస్ హైకోర్టు (మధురై బెంచ్) సమర్ధించింది.  జస్టిస్‌ జి. జయచంద్రన్‌, జస్టిస్‌ రామకృష్ణన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. 
 
తమిళనాడు డీఎంకే ప్రభుత్వం, వక్స్‌ బోర్డు, దర్గా కమిటీ గతంలో దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు తోసిపుచ్చింది. కార్తీక దీపాన్ని వెలిగించడానికి చట్టపరమైన అడ్డంకులు ఏవీ లేవని స్పష్టం చేసింది. ఏడాదికి ఒక్కసారి కార్తీకమాసంలో జరిగే ఈ దీపారాధన కార్యక్రమం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పేర్కొన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తప్పుపట్టింది. 
 
దేవస్థానం ప్రతినిధులు కార్తీక దీపం వెలిగించడం వల్ల ప్రజా శాంతికి భంగం కలుగుతుందని అనడం ‘హాస్యాస్పదంగా, నమ్మశక్యం కానిదిగా’ ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఆ రాతి స్తంభం వద్ద దీపం వెలిగించడాన్ని నిషేధిస్తూ ఎలాంటి ఆగమ శాస్త్రాలు లేదా బలమైన సాక్ష్యధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.  వివాదాస్పద రాతి స్తంభం దర్గాకు చెందినదని చెప్పే వాదనల్లో వాస్తవం లేదని, దీనిపై గతంలో కూడా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కోర్టు స్పష్టం చేసింది.
మదురై కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌, హిందూ ధార్మిక సంస్థల శాఖ లేవనెత్తిన అభ్యంతరాలను కోర్టు కొట్టివేస్తూ, ఆ ప్రదేశంలో దీపం వెలిగించకుండా ఆపడానికి అప్పీల్దార్లు తగిన ఆధారాలు చూపలేకపోయారని కోర్టు పేర్కొంది.  గత కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ స్తంభంపై దీపం వెలిగించేందుకు ప్రయత్నించగా ప్రభుత్వం అడ్డుకుంది.  అక్కడ దీపం వెలిగించడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశించింది. పక్కనే దర్గా ఉండటం వల్ల, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. 
అంతేకాదు అక్కడ దీపం వెలిగించకూడదని శాస్త్రాల్లో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.  అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రామ రవికుమార్ సహా పలువురు గత డిసెంబర్ 1న మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై స్పందించిన సింగిల్ జడ్జి దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం, దర్గా కమిటీ, వక్ఫ్ బోర్డు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  సింగిల్ జడ్జి నిర్ణయాన్ని కొట్టివేయాలి కోరారు. ఈ సందర్భంగా పలు అంశాల్ని కోర్టుకు తెలిపారు.  దీప స్తంభం ఉన్న దేవాలయం దర్గాకు చెందినదని, ఇక్కడ దీపం వెలిగించకూడదని శాస్త్రంలో ఉందని, అలాగే దీపం వెలిగించడం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 
 
దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఏడాదిలో ఒక రోజు దీపం వెలిగించినంత మాత్రాన శాంతి భద్రతల సమస్య తలెత్తదని అభిప్రాయపడింది. అలాగే దీపం వెలిగించొద్దని శాస్త్రాల్లో లేదనేందుకు తగిన ఆధారాల్ని కోర్టుకు సమర్పించలేదని తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వ రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ ఇక్కడ ఇబ్బంది కలిగితే అది ప్రభుత్వమే చేయించడానికి అవకాశం ఉందని, ప్రభుత్వం అలా దిగజారబోదని భావిస్తున్నట్లు తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఆ రాతి స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై తమిళనాడు బీజేపీ నేత అన్నామలై హర్షం వ్యక్తం చేశారు.