తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళ వెట్రి కళగం (టివికె) అధినేత, సినీనటుడు విజయ్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీన ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు విజయ్ హాజరు కావాలని అందులో పేర్కొన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. మరో 110 మంది గాయపడ్డారు.
ఈ ఘటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనకు కారణం ఏమిటి..? బాధ్యులు ఎవరు అనే విషయాన్ని సీబీఐ నిర్ధారించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. విజయ్ సభకు ఆలస్యంగా రావడంతో జనాలు అధికంగా చేరి తొక్కిసలాట జరిగిందని, సరైన నీటి సదుపాయం లేక చాలామంది డీహైడ్రేషన్‌కు గురై మరణించారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో జనవరి 12వ తేదీన ఢిల్లీలోని తమ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని విజయ్ కు సిబిఐ సమన్లు జారీ చేసింది.
ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తోంది. రిటైర్డ్ జడ్జి అజయ్ రస్తోగి నేతృత్వంలో సీనియర్ ఐపిఎస్ అధికారులు సుమిత్ చరణ్, సోనల్ మిశ్రా ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే కరూర్ ఎస్పీ సహా పలువురు పోలీసు అధికారులను, బాధిత కుటుంబాలను సిబిఐ విచారించింది. సభ నిర్వహణలో పోలీసుల భద్రతా లోపాలు ఉన్నాయా లేదా పార్టీ నిర్వాహకుల ప్రణాళికా లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.

More Stories
బిజెపి మహిళా కార్యకర్త దుస్తులు చింపేసిన కర్ణాటక పోలీస్!
జేఎన్‌యూలో ప్రధాని, హోంమంత్రిలపై నినాదాలు చేసినవారిపై వేటు!
ట్రంప్ మోదీని అపహరిస్తారా?’.. పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యలపై దుమారం!