పాక్ కోసం గూఢచర్యం వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హర్యానా, పంజాబ్, యూపీలో అనేకమంది గుఢచారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఒక 15ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను గత ఏడాది కాలంగా పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఏజెంట్లతో టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు.
భారత సైనిక రహస్యాలను, దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చేరవేస్తున్నట్లు గుర్తించారు. దిల్లీ ఉగ్రదాడి నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు, గూఢచర్య నెట్‌వర్క్‌పై నిఘా పెట్టగా ఈ బాల నేరస్తుడి విషయం వెలుగులోకి వచ్చింది. జమ్మూలోని సాంబా జిల్లాకు చెందిన ఈ బాలుడి వ్యవహారం ఇప్పుడు భద్రతా దళాలను ఉలిక్కిపడేలా చేసింది.
పఠాన్‌కోట్ ఎస్ఎస్పీ దల్జిందర్ సింగ్ ధిల్లాన్ తెలిపిన వివరాల ప్రకారం, బాలుడు జమ్మూలోని సాంబా జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ఆ బాలుడు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో, ఐఎస్‌ఐ అధికారులతో కాంటాక్ట్‌లో ఉన్నాడని తెలిసింది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.
బాలుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో నుంచి కీలక డిజిటల్ ఆధారాలు సేకరించారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతను దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలపడం భారత నిఘా సంస్థలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ బాలుడు ఉగ్ర మాడ్యూల్‌కు అనుబంధంగా ఉన్న పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్లతోనూ నిరంతరం మాట్లాడినట్టు తేలింది.
ఐఎస్ఐకి ఇలాంటి యువత అవసరమని, సులభంగా మోసపోయే వారినే వారు లక్ష్యంగా చేసుకుంటారని పోలీసులు స్పష్టం చేశారు. పిల్లల్లో ఉన్న అమాయకత్వాన్ని పాక్ ఏజెంట్లు ఆసరాగా చేసుకుంటున్నారు. అందులో భాగంగానే సోషల్ మీడియా ద్వారా ఈ బాలుడికి వల వేశారు. ముందుగా స్నేహంగా మాట్లాడారు. ఆ తర్వాత మెల్లగా బ్రెయిన్ వాష్ చేశారు.
ఆయుధాల శిక్షణ ఇస్తామని, ఆయుధాలు సప్లై చేస్తామని ఆశ చూపారు. ఈ విషయాల తీవ్రత తెలియక ఆ బాలుడు వారి ఉచ్చులో చిక్కుకున్నాడు. ఏడాదిన్నర కిందట ఈ బాలుడి తండ్రి చనిపోయారు. అయితే తన తండ్రిని ఎవరో హత్య చేశారని ఆ బాలుడు బలంగా నమ్మాడు. కానీ పోలీసుల విచారణలో అది హత్య కాదని తేలింది. అయినా ఆ బాలుడు నమ్మలేదు.
తండ్రి చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సహాయం కోసం వెతికాడు. ఇదే అదనుగా భావించిన పాక్ ఏజెంట్లు, గ్యాంగ్‌స్టర్లు అతనికి సాయం చేస్తామని నమ్మించి తమ దారిలోకి తెచ్చుకున్నారు. ఈ బాలుడికి మొబైల్ టెక్నాలజీపై మంచి పట్టు ఉంది. ఇతని ఫోన్ నుంచి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.
పాక్ ఏజెంట్లు ఇతని ఫోన్‌ను ‘క్లోనింగ్’ చేశారు. అంటే ఇతని ఫోన్ ఇక్కడ ఉన్నా, దాని కంట్రోల్ మొత్తం పాకిస్థాన్‌లో ఉంటుంది. బాలుడు మన దేశంలోని కీలక సైనిక స్థావరాలు, ముఖ్య ప్రదేశాల వీడియోలు తీసేవాడు. పాక్ ఏజెంట్లు ఇతని ఫోన్ హ్యాక్ చేసి, అక్కడి నుంచే ‘లైవ్’ ద్వారా ఆ ప్రదేశాలను చూసేవారు.
కేవలం ఇతను మాత్రమే కాదు, పంజాబ్ సరిహద్దు జిల్లాల్లో ఇంకా చాలా మంది పిల్లలు ఐఎస్‌ఐ ఉచ్చులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగానే భారతీయ యువతను, చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుంది. నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో వారిని ట్రాప్ చేస్తోంది. దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతోంది.

More Stories
ఢిల్లీ మసీదు వద్ద రాళ్లతో దాడి.. ఐదుగురు పోలీసులకు గాయాలు
బిజెపి మహిళా కార్యకర్త దుస్తులు చింపేసిన కర్ణాటక పోలీస్!
వైష్ణోదేవి సంస్థ మెడికల్ సీట్ల అనుమతి రద్దు!