అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్దాలు.. కొట్టిపారేసిన ఏపీ ప్రభుత్వం

అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్దాలు.. కొట్టిపారేసిన ఏపీ ప్రభుత్వం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును `రాజకీయ గురువు’గా పరిగణిస్తుంటారని ప్రతీతి. అయితే మొదటి సారిగా అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని తానే ఏపీ సీఎం చంద్రబాబుపై వత్తిడి తీసుకు వచ్చి ఆపివేయించానని చెప్పిన అబద్దాలను ఏపీ ప్రభుత్వం ఘాటుగా కొట్టిపారేసింది.

తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా నదీ జలాలపై శనివారం నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొంటూ వైఎస్‌ జగన్‌కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి కేసీఆర్‌ భుజం తట్టి ప్రోత్సహిస్తే, తాను చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ఆపించా అని చెప్పుకొచ్చారు. “రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఆపితేనే మేం ఏదైనా విషయాలపై చర్చకు వస్తామని చంద్రబాబుకు సూటిగా చెప్పా. నా మాట మీద గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపించారు. ఆ పనులు ఆగాయో.. లేదో తేల్చేందుకు నిజనిర్దారణ కమిటీని పంపించండి” అంటూ సూచించారు. 

“కూనంనేని సాంబశివరావు, అక్బరుద్దీన్‌ ఒవైసీ, బీజేపీ మహేశ్వర్‌ రెడ్డిలతో ఆ కమిటీని వేయండి. కావాలంటే గతంలో సాగునీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసిన కేసీఆర్‌, హరీశ్‌రావు ఇద్దరిలో ఒకరిని దీనికి చైర్మన్‌గా నియమించి విచారణకు పంపించండి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మంత్రి అయిన తర్వాత రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు ఆగాయో లేదో తేల్చుకోండి” అంటూ ప్రగల్భాలు పలికారు.

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రం పనులు నిలిపివేయించిందని ఏపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో రేవంత్ రెడ్డి ప్రకటనను ఖండించింది.  జగన్‌ మోహన్ రెడ్డి హయాంలో అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్టు పనులు చేపట్టారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. రాయలసీమకు రోజుకు 3 టీఎంసీలు అంటూ ప్రకటనతో జగన్‌ ప్రభుత్వం ఈ పనులు చేపట్టిందని, జగన్‌ ప్రచారంతో లిఫ్ట్‌ పనులపై అప్పటి తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసు వేసిందని పేర్కొంది. 

కేంద్రం, ఎన్‌జీటీతో పాటు పలుచోట్ల ఫిర్యాదు చేసిందని చెప్పింది. తెలంగాణ ఫిర్యాదులను విచారించి.. అనుమతులు లేనందున పనులు నిలిపివేయాలని 2020లోనే ఎన్‌జీటీ, కేంద్రం ఆదేశాలిచ్చిందని వివరించింది.  చంద్రబాబు కేంద్రంగా తెలంగాణలో అధికార పార్టీ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది.  ఏపీ నీటి హక్కులు, సీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఉండబోదని స్పష్టం చేసింది.