చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా అతిపెద్ద మార్పునకు భారత సైన్యం శ్రీకారం చుట్టింది. ఆధునిక యుద్ధ తంత్రంలో భాగంగా ఏకంగా లక్ష మందికి పైగా ‘డ్రోన్ ఆపరేటర్ల’తో ఒక భారీ మానవ సైన్యాన్ని తయారు చేసింది. అంతేకాదు, శత్రువుల స్థావరాలను ధ్వంసం చేసేందుకు ‘భైరవ్’ పేరుతో ఒక కొత్త స్పెషల్ ఫోర్స్‌ను రంగంలోకి దించింది. ఈ కొత్త దళం ఆధునిక సాంకేతికతతో శత్రువులను హడలెత్తించడానికి సిద్ధంగా ఉంది.
ఈ కొత్త ‘భైరవ్’ దళం ఏర్పాటు వెనుక భారీ వ్యూహం ఉంది. ఇది సాధారణ దళానికి, పారా స్పెషల్ ఫోర్సెస్‌కు మధ్య వారధిలా పనిచేస్తుంది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం కీలకంగా మారింది. అందుకే ఈ దళంలోని ప్రతి సైనికుడికి డ్రోన్లను ఆపరేట్ చేయడంలో, వాటిని యుద్ధంలో వాడటంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరు శత్రువుల భూభాగంలోకి చొరబడి, వారి స్థావరాలను డ్రోన్ల సాయంతో కచ్చితత్వంతో దెబ్బకొట్టగలరు.
అత్యంత వేగంగా, దూకుడుగా దాడులు చేయడం వీరి ప్రత్యేకత. వ్యూహాత్మక లోతుల వరకు వెళ్లి ఆపరేషన్లు చేయగల సత్తా వీరికి ఉంది. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆదేశాల మేరకు ఈ దళాల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే సుమారు 15 భైరవ్ బెటాలియన్లను భారత సైన్యం సిద్ధం చేసింది. వీటిని రెండు సరిహద్దుల్లోని (పాక్, చైనా) వివిధ కీలక ప్రాంతాల్లో మోహరించారు. భవిష్యత్తులో వీటి సంఖ్యను 25కు పెంచాలని సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను, హైబ్రిడ్ వార్‌ఫేర్ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ప్లాటూన్‌కు 10 డ్రోన్‌లు ఉంటాయి, వాటిలో నాలుగు నిఘా, గూఢచర్యానికి, ఆరు లోయిటరింగ్ కమ్యూనిషన్స్ కోసం కామికాజ్ డ్రోన్‌లుగా ఉపయోగపడతాయి. ఈ ఏర్పాటు బెటాలియన్ స్థాయిలో నిరంతర నిఘా, పర్యవేక్షణ, గూఢచార సమాచారాన్ని అందించడంతో పాటు తక్షణ దాడి సామర్థ్యాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
తద్వారా యుద్ధభూమిలో కమాండర్లు వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రతి బెటాలియన్‌లో ఫిరంగిదళం, సిగ్నల్స్, ఆర్మీ వైమానిక రక్షణ విభాగాలకు చెందిన అంశాలను కలిగి ఉన్న సుమారు 250 మంది ప్రత్యేక శిక్షణ పొందిన సైనికులు ఉంటారు. భైరవ దళాలు సాంప్రదాయ పదాతి దళాలకు, ఉన్నత స్థాయి ప్రత్యేక దళాలకు మధ్య ఉన్న కార్యాచరణ అంతరాన్ని పూరించడానికి ఉద్దేశించారు.
ప్రస్తుతం రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఈ దళం కఠోర శిక్షణ తీసుకుంటుంది. ‘సన్స్ ఆఫ్ ది సాయిల్’ అనే కాన్సెప్ట్‌తో స్థానికులకే పెద్దపీట వేశారు. రాజస్థాన్ ఎడారి ప్రాంతం, అక్కడి వాతావరణం, భాష, భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న స్థానిక యువకులను ఈ బెటాలియన్‌లో ఎక్కువగా చేర్చుకున్నారు. వీరిని ‘డెజర్ట్ ఫాల్కన్స్’ అని కూడా పిలుస్తున్నారు.
రాజస్థాన్ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీకగా వీరు నిలుస్తారని అధికారులు చెబుతున్నారు. సదరన్ కమాండ్ పరిధిలోని ఎడారిలో వీరు స్వతంత్రంగా ఆపరేషన్లు చేయగలరు. గడిచిన ఐదు నెలలుగా వీరు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి శిక్షణ పొందుతున్నారు. ఇటీవల జరిగిన ‘అఖండ్ ప్రహార్’ విన్యాసాల్లో వీరి సామర్థ్యాన్ని పరీక్షించారు.
సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ సమక్షంలో వీరు తమ యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించారు. టెక్నాలజీ, శారీరక దారుఢ్యం, తెలివితేటల కలయికగా ఈ దళం రూపుదిద్దుకుంది. ఈ ఏడాది జనవరి 15న జైపుర్‌లో జరగనున్న ఆర్మీ డే పరేడ్‌లో ఈ భైరవ్ దళం తొలిసారిగా కవాతు చేయనుంది.
కేవలం భైరవ్ మాత్రమే కాదు, భారత సైన్యం ‘రుద్ర బ్రిగేడ్స్’ పేరుతో మరో శక్తివంతమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఇవి ‘ఆల్ ఆర్మ్స్ ఫార్మేషన్స్’. అంటే ఇందులో ఇన్‌ఫాంట్రీ, మెకనైజ్డ్ యూనిట్లు, ట్యాంకులు, ఆర్టిలరీ, స్పెషల్ ఫోర్సెస్, డ్రోన్ వ్యవస్థలు అన్నీ ఒకే గొడుగు కింద ఉంటాయి. ఇది ఒక సంపూర్ణ యుద్ధ వ్యవస్థ. ఆర్టిలరీ, ఆర్మర్డ్ కార్ప్స్‌ను కూడా డ్రోన్లతో, మోడ్రన్ వార్‌ఫేర్ పరికరాలతో బలోపేతం చేస్తున్నారు.

More Stories
ఉమర్ ఖలీద్ కు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
పెట్రో డాలర్ల కోసమే ట్రంప్ బందీగా వెనెజువెలా అధ్యక్షుడు!
2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం