మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

రాష్ట్రంలో రానున్న మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బూత్ స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేస్తూ పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్‌ను కార్యకర్తల ఆధారంగా బలమైన యూనిట్‌గా తీర్చిదిద్దుతూ, ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు.

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బూత్ నిర్మాణ అభియాన్ రాష్ట్ర స్థాయి కార్యశాలలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, అదే రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ప్రతి బూత్‌లో కార్యకర్తలకు ఆయా బూత్‌లలోని ఓటర్లపై పూర్తి అవగాహన ఉండాలిని, గత ఎన్నికల్లో ఏ బూత్‌లలో తక్కువ ఓట్లు వచ్చాయో స్పష్టంగా గుర్తించాలని ఆయన చెప్పారు. కొన్ని బూత్‌లలో మొదటి స్థానం, మరికొన్నింటిలో రెండో స్థానం సాధించామని గుర్తుంచుకొని, బలహీనతలను బలంగా మార్చాలని తెలిపారు.  ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా పన్నా ప్రముఖ్ వ్యవస్థను విజయవంతంగా అమలు చేశామని, గుజరాత్‌లో కూడా అదే విధానం అనుసరించారని చెబుతూ ప్రతి 50 మంది ఓటర్లకు ఒక కార్యకర్త ఉండేలా పన్నా ప్రముఖ్ నిర్మాణం జరగాలని,  ప్రతి బూత్‌ను మనమే సంరక్షించుకోవాలని సూచించారు.

బూత్ నిర్మాణ అభియాన్ అనేది పార్టీ భవిష్యత్తు ఎన్నికలకు పునాదని చెబుతూ  పార్టీలో బూత్ అధ్యక్షుడే అత్యంత కీలకమైన వ్యక్తి అని, పార్టీకి మూలస్తంభం అని, పునాది బలంగా ఉన్నప్పుడే పార్టీ బలంగా ఎదుగుతుందని రామచందర్ రావు వివరించారు. బూత్ కమిటీల నిర్మాణమే అసలు లక్ష్యం. బూత్ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ – ఇలా అన్ని స్థాయిల్లో కమిటీల నిర్మాణం పూర్తి స్థాయిలో జరగాలని తెలిపారు.

జిల్లాల వారీగా వర్క్‌షాప్‌లు నిర్వహించి, మండల స్థాయి వరకు సంస్థాగత నిర్మాణ పనిని విస్తరించాలని చెప్పారు. బూత్ నిర్మాణం అనేది నిరంతర బాధ్యత అని, ప్రతి కార్యకర్త దీనిని తన వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేముల అశోక్, డా. ఎన్. గౌతం రావు, తూళ్ల వీరేందర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, భరత్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ గారు, తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.