భారత్ లో జరిగే టి20 ప్రపంచకప్‌ కు బాంగ్లాదేశ్ దూరం!

భారత్ లో జరిగే టి20 ప్రపంచకప్‌ కు బాంగ్లాదేశ్ దూరం!
* బాంగ్లాదేశ్ కాదంటే ఆ స్థానంలో తాము ఆడతాం అంటూ ఐస్​లాండ్ ఎద్దేవా!
 
భారత్, బంగ్లాదేశ్‌ మధ్య దౌత్య సంబంధాలే కాదు క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. హిందువుల హత్యలను నిరసిస్తూ ఐపీఎల్‌ నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ ను బీసీసీఐ తప్పించడాన్ని ఆ దేశ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. ఫిబ్రవరిలో జరుగబోయే టి20 ప్రపంచకప్‌ కోసం స్క్వాడ్‌ను ప్రకటించిన బంగ్లా క్రికెట్ బోర్డు ప్రపంచకప్‌ ఆడేందుకు తమ జట్టును భారత్ కు పంపమని ఐసీసీకి ఈ-మెయిల్‌ చేసింది.
 
ఆదివారం సమావేశమైన బంగ్లా బోర్డు సభ్యులు ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడానికి ప్రతిచర్యగా కీలక ప్రకటన చేశారు. మెగా టోర్నీకి లిటన్ దాస్ సారథిగా 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేసిన తర్వాత భద్రతా కారణాలతో భారత్‌కు తమ జట్టును పంపమని బోర్డు వెల్లడించింది. భారత్ లో బంగ్లాదేశ్ నాలుగు మ్యాచులు ఆడవలసి ఉంది. మూడు కోల్‌కత్తా, ఒకటి ముంబై వేదికగా జరగనున్నాయి.
 
“భద్రతా కారణాల రీత్యా మా జట్టును ప్రపంచకప్ కోసం భారత్‌కు పంపించడం సాధ్యం కాదు. బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. బీసీసీఐ నిర్ణయానికి కౌంటర్‌గా మేము ఈ తీర్మానం చేశాం. మా జట్టు మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించండి” అని బంగ్లా క్రికెట్ బోర్డు ఆదివారం ఐసీసీకి పంపిన ఈ-మెయిల్‌లో తెలిపింది.

అయితే, ఈ వివాదాల నేపథ్యంలో ఐస్​లాండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదిక ఎక్స్​లో సెటైరికల్ ట్వీట్ వేసింది. బంగ్లాదేశ్​ స్థానంలో వరల్డ్​కప్​లో ఆడేందుకు తాము రెడీ అంటూ ట్వీట్​లో రాసుకొచ్చింది. భారత్​కు వచ్చి ఆడేందుకు తమకు ఎలాంటి భద్రతాపరమైన ఆందోళన లేదంటూ ఐస్​లాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

“మమ్మల్ని ఎవరూ అడగకముందే చెప్తున్నాం. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ స్థానాన్ని ఐస్‌లాండ్ భర్తీ చేయగలదు. మా భద్రతకు సంబంధించిన ఎలాంటి ఆందోళనలు మాకు లేవు. మా ఆటగాళ్లకు ఉండొచ్చేమో, కానీ మాకు కాదు” అంటూ బంగ్లాదేశ్​ తాజా నిర్ణయాన్ని ఉద్దేశిస్తూ ఐస్​లాండ్ ఈ పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు బంగ్లాదేశ్​ను మాస్ ర్యాగింగ్ చేయడమే అంటూ కామెంట్లలో తెలుపుతున్నారు. ఐస్​లాండ్ రిక్వెస్ట్​ను పరిశీలనలోకి తీసుకోండి అంటూ ఐసీసీని ట్యాగ్ చేస్తున్నారు. ‘బంగ్లాదేశ్ ఎందుకు పాకిస్థాన్​ స్థానం తీసుకోండి’ అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా బాంగ్లాదేశ్ క్రీడా సలహాదారుడు ఆసిఫ్‌ నజ్రుల్‌ ఫేస్‌బుక్‌ ద్వారా స్పందిస్తూ భారత క్రికెట్‌ బోర్డు అనుసరిస్తున్న దూకుడు విధానాల వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, కాంట్రాక్టు ఉన్న ఆటగాడికే అక్కడ అనుమతి లేనప్పుడు, తమ జాతీయ జట్టుకు అక్కడ రక్షణ ఉంటుందని తాము భావించడం లేదని పేర్కొన్నారు. 
 
తమ ఆటగాళ్ల భద్రత దష్ట్యా ఫిబ్రవరిలో కోల్‌కతా, ముంబై వేదికగా జరగాల్సిన బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లిఖితపూర్వకంగా కోరతామని ఆయన తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 7 నుంచి 17 మధ్య బంగ్లాదేశ్‌,  వెస్టిండీస్‌, ఇటలీ, ఇంగ్లాండ్‌, నేపాల్‌లతో ఆడాల్సి ఉంది. మరోవైపు, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ను, క్రికెటర్లను అగౌరవపరిస్తే సహించేది లేదని స్పష్టం చేసిన నజ్రుల్‌ బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని సమాచార ప్రసారాల శాఖను ఆదేశించారు.