అనర్హుల పాలవుతున్న సంక్షేమ పధకాలు

అనర్హుల పాలవుతున్న సంక్షేమ పధకాలు
సంక్షేమ పథకాల ఫలాలు పేదలకే చేరాల్సి ఉండగా అనర్హుల పాలవుతూ ఉండటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంక్లూజివ్ గవర్నమెంట్ హైదరాబాద్ (ఐఐజిహెచ్) ఆధ్వర్యంలో బేగంపేట సెస్   భవనంలో తెలంగాణ లో పరిపాలన మెరుగుపర్చడం-ఆర్థిక నిర్వహణ – సంక్షేమ పాలన అంశంపై జరిగిన  రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న కోట్లాది రూపాయలు వృధా అవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు.
 
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల తీరుతెన్నులపై జరిగిన చర్చలో అభివృద్ధి పనుల కోసం అప్పులు చేయడం తప్పు కాదని, అయితే రోజు వారీ ఖర్చుల కోసం కూడా అప్పులు చేయడం తగదందని స్పష్టం చేశారు. అలాగే అంత లాభదాయకం కాని భారీ ప్రాజెక్టుల నిర్మాణం సరికాదని తెలిపారు. ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 
 
సంక్షేమం, అభివృద్ధి  విషయంలో సమతుల్యత అవసరమని వారు పేర్కొన్నారు. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ,  ప్రొఫెసర్ కృష్ణారెడ్డి చిట్టెడి కీలక ఉపన్యాసం చేశారు. ఐఐజీహెచ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ మురళీ మనోహర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఐఐజీహెచ్ చేపడుతున్న కార్యక్రమాలను, సదస్సు ఉద్దేశాలను వివరించారు.
 
 ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి,  విశ్లేషకుడు సురేష్ కొల్చాటి, న్యాయవాది బండారు రామ్మోహన్ రావు,  ఫణిధర్ రావు, బిజెపి నాయకుడు పేరాల చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. స్త్రీ శక్తి  ప్రతినిధి అజులి, సీనియర్ జర్నలిస్టులు కప్పర ప్రసాద్, రావికంటి శ్రీనివాస్, వివిధ రంగాల ప్రతినిధులు, విద్యావేత్తలు, పలు యూనివర్సిటీల  విద్యార్థులు  పాల్గొన్నారు.