యధాతధంగా `ఉపాధి’ చట్టం.. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

యధాతధంగా `ఉపాధి’ చట్టం.. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ శాసనసభ తీర్మానించింది. ఈ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వికసిత్‌ భారత్‌ – గ్యారెంటీ ఫర్‌ గ్రామీణ్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ (విబి జి ఆర్‌ఎఎం జి) పథకం పేదలకు వ్యతిరేకమని పేర్కొంది. దీనిని అమలు చేయవద్దని కోరింది. 

అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా బిజెపి వ్యతిరేకించింది.  విబి జి ఆర్‌ఎఎం జిని బిజెపి సమర్థించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించింది. బిజెపి సభ్యులు మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ విబి జి ఆర్‌ఎఎం జి వల్ల ఏ వర్గానికీ నష్టం జరగదని స్పష్టం చేశారు.

ఈ తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 2005లో యుపిఎ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందని, ప్రతి గ్రామీణ కుటుంబానికీ ఏడాదిలో వంద రోజులు పని కల్పించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో లబ్ధి పొందిన వారిలో 90 శాతం మంది ఎస్‌సిలు, ఎస్‌టిలు, బిసిలే ఉన్నారని, వారిలో 62 శాతం మంది మహిళలేనని తెలిపారు. 

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం విబి జి ఆర్‌ఎఎం జి పథకాన్ని తీసుకొచ్చిందని, ఇది ఉపాధి చట్టం ఆత్మను దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. దీనివల్ల పనిదినాలు తగ్గిపోతాయని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిధుల వాటాను నిర్ణయించారని ధ్వజమెత్తారు. కొత్త పథకంలో శ్రమ ఆధారిత పనులు తొలగించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. 

ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని పేదల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. సిపిఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం పేదల జీవనంతో మమేకమైందని,ఈ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. ఎంఐఎం సభ్యులు జుల్ఫికర్‌ అలీ  ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్వాగతించారు. బిఆర్‌ఎస్‌ పార్టీ అప్పటికే వాకౌట్‌ చేయడంతో ఈ తీర్మానంపై చర్చలో పాల్గొనలేదు.