హిందూ ధర్మంపై మాట్లాడితే ఇస్లాంకు వ్యతిరేకమని కాదు

హిందూ ధర్మంపై మాట్లాడితే ఇస్లాంకు వ్యతిరేకమని కాదు
ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లౌకికవాదం, హిందూ ధర్మంపై తనకున్న స్పష్టమైన వైఖరిని మరోసారి చాటిచెప్పారు. జనసేన తరఫున గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్ల అభినందన సభలో పాల్గొన్న ఆయన, లౌకికవాదం అనే పదానికి అర్థం మారుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. “లౌకికవాదం అంటే ఎవరికీ నచ్చినట్లు వారు ఇతరులను తిట్టుకునే హక్కు కాదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు. 

అన్ని మతాలను గౌరవించడమే అసలైన లౌకికవాదమని, కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. తాను హిందూ ధర్మం గురించి మాట్లాడటం అంటే అది ఇతర మతాలకు వ్యతిరేకం కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

“నేను హిందూ ధర్మం గురించి మాట్లాడితే అది ఇస్లాంకో లేదా క్రైస్తవానికో వ్యతిరేకం అని భావించకూడదు. నాకు ముస్లిం మరియు క్రైస్తవ సమాజాల్లోనూ అశేషమైన అభిమాన గణం ఉంది. నన్ను ప్రాణప్రదంగా ప్రేమించే వారిని నేను ఎందుకు ద్వేషిస్తాను?” అని ఆయన ప్రశ్నించారు. సమాజంలో అన్ని మతాల మధ్య సామరస్యం ఉండాలని, తన పోరాటం కేవలం ధర్మాన్ని రక్షించుకోవడం కోసమే తప్ప, వేరే మతాలను కించపరచడం కోసం కాదని ఆయన వివరించారు. 

తన రాజకీయ ప్రస్థానం, వ్యక్తిగత ఆశయాల గురించి మాట్లాడుతూ, తాను ఎప్పుడూ నిస్వార్థంగానే పని చేస్తానని పవన్ తెలిపారు. “ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడుతున్నాను. ఇక తెలంగాణ నుంచి నేను ఆశించేది ఏముంటుంది? సినిమా రంగంలో ఉన్నప్పుడు అక్కడి ప్రజలు నాపై అంతులేని అభిమానాన్ని చూపించారు. ఒక కళాకారుడిగా అంతకన్నా ఏం కావాలి?” అని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.రాజకీయాల కంటే ప్రజల ప్రేమే తనకు మిన్న అని, సమాజ హితం కోసమే తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నానని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.