భోగాపురం విమానాశ్రయంలో దిగిన తొలి విమానం

భోగాపురం విమానాశ్రయంలో దిగిన తొలి విమానం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం దిగింది. ఆదివారం ఉదయం10:15 గంటలకు తొలి బిజినెస్ ఫ్లైట్‌ ల్యాండింగ్‌ అయింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు చేరుకున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో 300 విమానాలు దిగే సదుపాయం కల్పించింది. తొలి దశ నిర్మాణ పనులకు రూ.4,592 కోట్ల వ్యయం అయింది. 
 
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మీరు చేరుకున్నారనే మాట విమానంలో వినిపించే సరికి ఎంతో పులకించిపోయానని పేర్కొన్నారు. 96 శాతం విమానాశ్రయ పనులు పూర్తి అయ్యయని తెలియచేయటానికి ఎంతో సంతోషిస్తున్నామని తెలిపారు. 
 

ఈ విమానాశ్రయంలో ఒకేసారి 300 విమానాలు దిగే సదుపాయాలు కల్పించడం విశేషం. అంతర్జాతీయ బిడ్స్ ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయ నిర్మాణం చేపట్టారు. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్‌బస్ ఏ380, బోయింగ్ 747-8 వంటి భారీ విమానాలు కూడా సులభంగా ల్యాండ్ అయ్యేలా రన్‌వేలను డిజైన్ చేశారు.తొలి దశలోనే ప్రతి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న టెర్మినల్‌ను నిర్మించనున్నారు. ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ఉపయోగపడనుంది. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విస్తరణకు కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. భోగాపురం నుంచి విశాఖపట్నం చేరుకోవడానికి మూడు ప్రధాన రహదారి మార్గాలు సిద్ధం చేయడం వల్ల ప్రయాణికులకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి.

భోగాపురంలో తొలి విమానం ల్యాండ్ కావడం ఎయిర్‌పోర్ట్‌‌ చరిత్రలో కీలక మైలురాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్‌లో తొలి విమానం ల్యాండింగ్ కావడంపై తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఏపీ విమానయాన రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం నమోదైందని తెలిపారు. వ్యాలిడేషన్ ప్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ప్రాంతీయ అనుసంధానం (కనెక్టివిటీ) బలోపేతం అవుతుందని.. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి భారీగా ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు మద్దతు అందించిన ప్రధాని మోదీకి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే ప్రజల సేవలకు విమానాశ్రయం సిద్ధమవుతోందని చెప్పారు. ఈ ఏడాది జూన్ నుంచి ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయన్నారు.