కేరళ అభివృద్ధి చెందాలంటే, బీజేపీ సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి, త్రిసూర్ ఎంపీ సురేశ్ గోపి అన్నాస్పష్టం చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలతో బీజేపీ పాలిత రాష్ట్రాలు పొందుతున్న ప్రయోజనాల గురించి ఒకసారి తెలుసుకోవాలని కేరళ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అయితే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం లేకపోయినా తమిళనాడు రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని సురేశ్ గోపి కొనియాడారు.
కేంద్రంలో ప్రత్యర్ధి పార్టీలు అధికారంలో ఉన్నా, రాష్ట్ర ప్రజలకు అవసరమైనవన్నీ తమిళనాడు సర్కారు సాధించుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. కొల్లాం లోక్‌సభ ఎంపీ, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నేత ఎన్‌కే ప్రేమ చంద్రన్‌తో కలిసి కొల్లాం రైల్వే జంక్షన్‌ను కేంద్రమంత్రి సందర్శించారు. రైల్వే జంక్షన్‌లోని ప్రాచీన భవనాలను వారసత్వ కట్టడాలుగా పరిరక్షించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాల గురించి అధికారులను అడిగి సురేశ్ గోపి తెలుసుకున్నారు.
“కేరళ అభివృద్ధి కోసం బీజేపీ తప్పకుండా బలోపేతం కావాలి. అది సొంతంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి లేదా రాష్ట్రంలో ప్రభావశీల రాజకీయ శక్తిగా ఎదగాలి. అలా జరిగితేనే రాష్ట్ర వికాసం సాధ్యమవుతుంది” అని తెలిపారు.
“మచ్చుకు చూస్తే, కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరీని తొలుత నేను ప్రాతినిధ్యం వహిస్తున్న త్రిసూర్‌కు కేటాయించాలని ప్రతిపాదించారు. త్రిసూర్‌లో ఈ లేబొరేటరీ ఏర్పాటుకు 25 ఎకరాల స్థలాన్ని కేటాయించమని రాష్ట్ర సర్కారును కేంద్ర ప్రభుత్వం కోరింది. కానీ రాష్ట్ర సర్కారు త్రిసూర్‌లో సరిపడా స్థలం లేదని కేంద్రానికి చెప్పింది. ఎందుకంటే త్రిసూర్‌లో నేను బీజేపీ ఎంపీగా ఉన్నాను” అని విమర్శించారు.
అందుకే ప్రతిపాదిత ఫోరెన్సిక్ లేబొరేటరీ త్రిసూర్ నుంచి తిరువనంతపురానికి తరలిపోయిందని చెప్పారు. రాష్ట్ర సర్కారు ఇలా వ్యవహరిస్తే, కేరళకు మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఆయన పిలుపిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ అభివృద్ధి చెందాలని హితవు చెప్పారు.
“ఏ ఒక్క నగరానికో అభివృద్ధి పరిమితం కాకూడదు. ఇప్పటికే త్రిసూర్ జిల్లా చాలా అభివృద్ధి ప్రాజెక్టులను కోల్పోయింది. ఈవిషయాలన్నీ మా జిల్లా ప్రజలకు తెలియాలి” అని కేంద్రమంత్రి చెప్పారు. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం కావాలని ఆయన స్పష్టం చేశారు.
“జనవరి 5న డిల్లీకి వెళ్తున్నాను. త్వరలోనే నేను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలుస్తా. కొల్లాం రైల్వే స్టేషన్‌లోని ప్రాచీన భవనాలను వారసత్వ కట్టడాలుగా పరిగణించాలని కోరుతాను. వాటిని పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయొచ్చు. ఈ రైల్వే స్టేషన్‌లో బ్రిటీష్ కాలంలో నిర్మించిన కొన్ని కట్టడాలను ఇప్పటికే కూల్చేశారు. వాటిని కూడా పరిరక్షించి ఉండాల్సింది” అని సురేశ్ గోపి పేర్కొన్నారు.

More Stories
పెట్రో డాలర్ల కోసమే ట్రంప్ బందీగా వెనెజువెలా అధ్యక్షుడు!
లక్ష మంది డ్రోన్ సైనికులతో స్పెషల్ ఫోర్స్ ‘భైరవ్’!
2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం