తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇటీవల విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో అనేక చోట్ల తీవ్రమైన వ్యత్యాసాలు, తప్పిదాలు ఉన్నట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర విభాగం గుర్తించింది. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా మెమోరాండం సమర్పించారు.
ఈ బృందంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్. గౌతం రావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, బీజేపీ సీనియర్ నాయకులు డా. ఎస్. ప్రకాష్ రెడ్డి, బిజెపి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అఫైర్స్ కమిటీ సభ్యుడు ఆంటోనీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఓటర్ల జాబితాలను వార్డుల వారీగా పరిశీలించగా, అనేక ప్రాంతాల్లో ఓటర్ల నమోదు విషయంలో తీవ్రమైన అసమానతలు కనిపించాయని శశిధర్ రెడ్డి తెలిపారు.
మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొంతమంది ఓటర్లు దేవరకొండ మున్సిపాలిటీ ఓటర్ లిస్టుల్లో నమోదు కాగా, మున్సిపాలిటీ పరిధిలోకి రాని కొన్ని గ్రామపంచాయతీలకు చెందిన ఓటర్లు కూడా మున్సిపల్ ఓటర్ లిస్టుల్లో కనిపించాయని చెప్పారు. అదేవిధంగా, దేవరకొండ నుంచి సుమారు 15–20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టిముక్కుల గ్రామానికి చెందిన ఓటర్లు దేవరకొండ మున్సిపాలిటీ ఓటర్ లిస్టుల్లో నమోదు అయినట్లు గుర్తించామని విస్మయం వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల కోసం సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో తయారైన ఓటర్ జాబితాను ఆధారంగా తీసుకుని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ప్రక్రియలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. అయితే గతంలో కూడా కిందిస్థాయిలో ఓటర్ లిస్టుల్లో చేర్పులు-తొలగింపుల నేపథ్యంలో తప్పిదాలు జరిగాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుల్లో చోటుచేసుకున్న ఈ వ్యత్యాసాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, బాధ్యత వహించాల్సిన అధికారులెవరైనా ఉంటే, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వార్డు వారీగా, మున్సిపాలిటీ వారీగా ఓటర్ లిస్టులను సరిచేయాలని కోరినట్లు చెప్పారు.
ఏ స్థాయిలో లోపాలు చోటుచేసుకున్నాయన్న దానిపై పూర్తి స్థాయి ఎంక్వైరీ జరపాలని, అలాగే బాధ్యత వహించాల్సిన అధికారులు ఎవరైనా ఉంటే, వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Stories
ఫోన్ ట్యాపింగ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ
హైదరాబాద్లో దారుణంగా పడిపోతున్న వాయు నాణ్యత
అనర్హుల పాలవుతున్న సంక్షేమ పధకాలు