వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడులు.. అధ్యక్షుడిని పట్టివేత

వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడులు.. అధ్యక్షుడిని పట్టివేత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వెనిజులాపై అమెరికా ఒక విస్తృత సైనిక దాడిని విజయవంతంగా నిర్వహించిందని, దీని ఫలితంగా ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యను పట్టుకున్నారని ప్రకటించారు. ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్ట్ ప్రకారం, ఈ ఆపరేషన్ అమెరికా చట్ట అమలు సంస్థల సహకారంతో నిర్వహించారు. మదురోతో పాటు అతని భార్యను కూడా దేశం వెలుపలికి తరలించారు.
 
స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ వైమానిక దాడిలో, రాజధాని కారకాస్‌తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా అనేక పేలుళ్లు సంభవించినట్లు నివేదికలు వచ్చాయి.    అంతకు ముందు వెనెజువెలాలో ‘అత్యవసర పరిస్థితి’ విధిస్తున్నట్లు అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించారు.  రాజధాని కరాకస్‌లో జరిగిన వరుస పేలుళ్లను ఆయన తీవ్రంగా పరిగణించారు. 
ఇదంతా అమెరికా చేస్తున్న “అత్యంత ప్రమాదకరమైన సైనిక దురాక్రమణ” అని మదురో ప్రభుత్వం ఆరోపించింది. తమ దేశ సార్వభౌమత్వంపై, ప్రజలపై అమెరికా ప్రభుత్వం జరుపుతున్న దాడులను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించింది.  స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ భయానక ఘటనలు జరిగాయి.
రాజధాని కరాకస్ పరిసరాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఏడు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. ఆకాశంలో యుద్ధ విమానాలు అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ భీకర శబ్దాలు చేశాయి.  గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఆ శబ్దాలకు ఉలిక్కిపడి లేచారు. ప్రాణభయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.  నగరం నలుమూలల నుంచి పొగలు రావడం కనిపించింది. మిలిటరీ స్థావరాలు లక్ష్యంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

“వెనెజువెలా భూభాగంపై, ప్రజలపై అమెరికా ప్రభుత్వం చేస్తున్న సైనిక దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నాం. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. దేశ రక్షణ కోసం ఎమర్జెన్సీ విధిస్తున్నాం” అని మదురో ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.  మరోవైపు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ వెనెజువెలా గగనతలంపై ఆంక్షలు విధించింది. అమెరికాకు చెందిన కమర్షియల్ విమానాలు అటువైపు వెళ్లకూడదని స్పష్టం చేసింది.

అక్కడ కొనసాగుతున్న సైనిక కార్యకలాపాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.  పేలుళ్లు జరగడానికి ముందే ఈ ఆంక్షలు విధించడం గమనార్హం. ఆ ప్రాంతంలోని సైనిక చర్యలను పర్యవేక్షించే ‘యూఎస్ సదరన్ కమాండ్’ కూడా దీనిపై స్పందించడానికి నిరాకరించింది.  వెనెజువెలా నుంచి అమెరికాకు భారీగా మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. 

వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా ‘నార్కో-టెర్రరిస్ట్’గా అభివర్ణిస్తోంది. డ్రగ్స్ ముఠాలతో మదురో చేతులు కలిపారని ఆరోపిస్తోంది. డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు వెనెజువెలాలో భూతల దాడులు సైతం చేస్తామని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు.  అమెరికా ఆరోపణలను వెనెజువెలా అధ్యక్షుడు మదురో తీవ్రంగా ఖండించారు.

గురువారం ప్రసారమైన ఒక ఇంటర్వ్యూలో “అమెరికాకు కావాల్సింది డ్రగ్స్ నియంత్రణ కాదు. వెనెజువెలాలో ఉన్న అపారమైన చమురు నిల్వలను దక్కించుకోవడమే వారి అసలు లక్ష్యం. అందుకే నా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు” అని ఆరోపించారు.  “మాదకద్రవ్యాల అడ్డుకట్టకు అమెరికాతో చర్చించేందుకు నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ వారు చర్చలకు రాకుండా యుద్ధానికి దిగుతున్నారు. ఆగస్టులో కరేబియన్ సముద్రంలో భారీగా సైన్యాన్ని మోహరించడం దీనిలో భాగమే” అని మదురో స్పష్టం చేశారు.

అలాగే, కేవలం సైనిక దాడులే కాకుండా ఆర్థికంగానూ వెనెజువెలాను దెబ్బకొట్టాలని అమెరికా చూస్తోంది. వెనెజువెలాకు చెందిన చమురు నౌకలను అమెరికా సీజ్ చేసింది. ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించింది. దీనివల్ల వెనెజువెలా ఆర్థిక వ్యవస్థ ఊపిరాడకుండా చేయాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది.