None
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. పెరిగిన ధరలకు తోడు రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పడిపోవడంతో ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనానికి నిరసనగా ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఏడుగురు మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో భద్రతా దళానికి చెందిన ఓ సభ్యుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి.
ఇరాన్లో నెలకొన్న దారుణ పరిస్థితులను నిరసిస్తూ రాజధాని టెహ్రాన్‌లో ప్రారంభమైన ఈ అల్లర్లు, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా లూర్ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే అజ్నా, లోర్డెగాన్, కూహ్దాష్ట్ నగరాల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
ప్రభుత్వ భవనాలపై ఆందోళనకారులను రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. కొన్ని చోట్ల పరిస్థితులు చేయి దాటిపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. శాంతికి విఘాతం కలిగించారనే ఆరోపణలతో పశ్చిమ టెహ్రాన్‌లోని మలార్డ్ జిల్లాలో 30, కూహ్దాష్ట్ నగరంలో 20 మంది నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇరాని కరెన్సీ రియల్ విలువ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ విలువ దాదాపు 1.4 మిలియన్ రియల్స్ పలుకుతోంది. దీని ప్రభావంతో ఇరాన్లో డిసెంబర్ నాటికి వార్షిక ద్రవ్యోల్బణం 52 శాతానికి చేరుకుంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆమాంతం పెరిగాయి. అణు సామర్థ్యాన్ని ఇరాన్ బలోపేతం చేసుకుంటోందన్న కారణంతో గతేడాది జూన్‌లో ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింత దారుణంగా పడిపోయింది.
పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల చమురు ఎగుమతులు తగ్గడంతో ఇరాన్లో పరిస్థితి మరింత ఊహించనంతగా దిగజారింది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమై రోడ్లపై వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. దేశంలో ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నిరసనకారులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అంతర్గత వ్యవహారాల మంత్రిని ఆదేశించారు.
అయితే అందోళనకారులతో చర్చలకు సిద్ధమని సంకేతాలు పంపినప్పటికీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం తన చేతుల్లో లేదన్నారు. ఇరాన్లో నెలకొన్న ఆందోళనల వెనుక విదేశీ నిఘా సంస్థల హస్తం ఉందని ప్రభుత్వ వర్గాలు, స్థానిక మీడియా ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఇదే తరహాలో కాల్పులు జరిపి చంపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందని హెచ్చరించారు.
కాగా, ఇరాన్ అధికారులు నిరసనకారులపై బలప్రయోగం చేస్తే జోక్యం చేసుకుంటామని బెదిరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం దేశంపై ఏదైనా దాడి “వేగవంతమైన మరియు సమగ్రమైన” ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందని హెచ్చరించింది.

More Stories
ఉమర్ ఖలీద్‌కు న్యూయార్క్ మద్దతు వెనుక రాహుల్?
ఎక్స్ గ్రోక్లో అశ్లీల కంటెంట్- వెంటనే తొలగించాలి
చైనా సైన్యం గుప్పిట్లోకి బలూచిస్థాన్?