ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల హత్యలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. 2025లో ప్రపంచవ్యాప్తంగా 128 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌జె) వెల్లడించింది. వీరిలో సగం మందికి పైగా జర్నలిస్టులు మధ్యప్రాచ్యంలోనే మరణించటం గమనార్హం. ఈ సంఖ్య 2024తో పోలిస్తే పెరిగిందని ఐఎఫ్‌జె వివరించింది.
”ఇది కేవలం గణాంకాలు కావు. మా సహచరుల కోసం ఇది ప్రపంచస్థాయి రెడ్ అలర్ట్” అని ఐఎఫ్‌జె ప్రధాన కార్యదర్శి ఆంథోనీ బెల్లాంజర్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా పాలస్తీనా ప్రాంతాల్లో పరిస్థితిపై ఐఎఫ్‌జె తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయిల్ – హమాస్ మధ్య గాజాలో కొనసాగుతున్న యుద్ధంలో 2025లో 56 మంది జర్నలిస్టులు మరణించారని ఐఎఫ్‌జె పేర్కొన్నది.
ఇంత చిన్న ప్రాంతంలో, ఇంత తక్కువ సమయంలో ఇన్ని మరణాలు తాము ఎన్నడూ చూడలేదని బెల్లాంజర్ చెప్పారు. భారత్‌తో పాటు యెమెన్, ఉక్రెయిన్, సూడాన్, పెరూ సహా ఇతర దేశాల్లో కూడా జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ఈ దాడులకు బాధ్యులైన వారికి శిక్షలు పడటం లేదని, ఇటువంటి చర్యలను ఖండిస్తున్నామని బెల్లాంజర్ పేర్కొన్నారు.
న్యాయం జరగకపోతే జర్నలిస్టులను హత్య చేసే వారికి అది ప్రోత్సాహం ఇస్తుందని ఆయన హెచ్చరించారు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 553 మంది జర్నలిస్టులు ప్రస్తుతం జైళ్లలో ఉన్నారని ఐఎఫ్‌జె వెల్లడించింది. గత ఐదేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా నమోదు కావటం గమనార్హం. ఇక రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ గణాంకాల ప్రకారం 2025లో విధి నిర్వహణలో 67 మంది జర్నలిస్టులు మరణించారు. యునెస్కో మాత్రం ఈ సంఖ్యను 93గా పేర్కొన్నది.

More Stories
ఇరాన్ లో నిరసనలపై జోక్యం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరిక
చైనా సైన్యం గుప్పిట్లోకి బలూచిస్థాన్?
బంగ్లాదేశ్లో సజీవ దహనం నుండి తప్పించుకున్న మరో హిందూ