చైనా సైన్యం గుప్పిట్లోకి బలూచిస్థాన్?

చైనా సైన్యం గుప్పిట్లోకి బలూచిస్థాన్?
దక్షిణాసియాలో వ్యూహాత్మక సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పాకిస్థాన్‌లోని అస్థిర ప్రాంతమైన బలూచిస్థాన్‌లో చైనా తన సైనిక బలగాలను (పీఎల్ఏ) మోహరించబోతోందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ప్రముఖ బలూచ్ నేత మీర్ యార్ బలూచ్ ఈ మేరకు ఒక  ప్రకటన చేశారు. చైనా-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న సైనిక అనుసంధానం కేవలం బలూచిస్థాన్‌కే కాకుండా, భారతదేశ భద్రతకు కూడా పెను ముప్పుగా పరిణమించబోతోందని ఆయన హెచ్చరించారు.

బలూచ్ ప్రతినిధి మీర్ యార్ బలూచ్ భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు రాసిన బహిరంగ లేఖలో పలు సంచలన విషయాలను వెల్లడించారు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టు ఇప్పుడు తుది దశకు చేరుకుందని, ఈ క్రమంలో తన పెట్టుబడులను కాపాడుకోవడానికి చైనా నేరుగా తన సైన్యాన్ని బలూచిస్థాన్ గడ్డపై దింపేందుకు సిద్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు.

 
“మరో కొన్ని నెలల్లోనే బలూచిస్థాన్‌లో చైనా సైనికుల బూట్ల చప్పుడు వినిపించవచ్చు” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  బలూచిస్థాన్‌లో చైనా సైనిక ఉనికి కేవలం స్థానిక సమస్య కాదని, ఇది భారత భవిష్యత్తుకు కూడా సవాలుగా మారుతుందని మీర్ యార్ బలూచ్ విశ్లేషించారు. చైనా, పాకిస్థాన్ కూటమి అంతకంతకూ బలపడుతోందని, దీనిని అడ్డుకోవడానికి బలూచ్ స్వాతంత్ర్య పోరాట శక్తులకు అంతర్జాతీయ మద్దతు అవసరమని ఆయన కోరారు. 
 
ముఖ్యంగా గత ఏడాది భారత ప్రభుత్వం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ వంటి ధైర్య సాహసోపేతమైన చర్యలను ఆయన ప్రశంసించారు. ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన మెరుపు దాడులు ప్రాంతీయ భద్రతకు ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.  గత ఏడు దశాబ్దాలుగా పాకిస్థాన్ సైన్యం బలూచిస్థాన్‌లో సాగిస్తున్న అరాచకాలు, అపహరణలు, ఊచకోతలను ఆయన తన లేఖలో ప్రస్తావించారు.
 
పాకిస్థాన్ తన స్వార్థం కోసం బలూచిస్థాన్ వనరులను చైనాకు తాకట్టు పెడుతోందని, 6 కోట్ల మంది బలూచ్ ప్రజల అనుమతి లేకుండా చైనా సైన్యం అక్కడ అడుగు పెడితే అది చట్టవిరుద్ధమైన ఆక్రమణే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం, మరోవైపు చైనా తన ప్రాజెక్టుల రక్షణ కోసం పాక్ సైన్యంపై నమ్మకం కోల్పోవడం వంటి పరిణామాలు ఈ సైనిక మోహరింపు వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. 
 
ఈ ఉదంతంపై అటు చైనా గానీ, ఇటు పాకిస్థాన్ గానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అయితే బలూచ్ నేత చేసిన ఈ హెచ్చరికలు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.