కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ మధ్య ఫిక్స్‌డ్ మ్యాచ్ నడుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆ మ్యాచ్కు త్వరలో తెరపడనుందని తెలుపుతూ తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్ వీ.వి. రాజేశ్‌కు ప్రధానమంత్రి లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన వేళ, తిరువనంతపురం కార్పొరేషన్ కొత్త మేయర్‌గా ఎన్నికైన రాజేశ్‌కు అభినందన లేఖ పంపారు మోదీ.
దాన్ని రాజేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు రాజేశ్. అందులో మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన జి.ఎస్. ఆశా నాథ్‌ను కూడా ప్రధాని మోదీ అభినందించారు. 2026 సంవత్సర ఆరంభంలో, పండుగ వాతావరణంలో తిరువనంతపురం నగరంలో చరిత్ర సృష్టించారని ప్రధాని కొనియారు. రాజేశ్ మేయర్‌గా, ఆశాజీ డిప్యూటీ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని మోదీ తెలిపారు.
తిరువనంతపురం నగరానికి ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని గుర్తుచేశారు. ప్రతిమలయాళీ హృదయంలో గర్వస్థానాన్ని కలిగిన నగరమని పేర్కొన్నారు. శ్రీ పద్మనాభస్వామి ఆశీస్సులతో, కేరళ రాజధానిగా, ఆలోచనాపరులు, సామాజిక సంస్కర్తలు, కళాకారులు, కవులు, సంగీతకారులు, సాంస్కృతిక మహనీయులను అందించిన నగరంగా ప్రధాని వర్ణించారు. అలాంటి నగరం బీజేపీకి ఆశీర్వాదం ఇవ్వడం ఎంతో వినయాన్ని కలిగిస్తోందని మోదీ పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ ప్రతిపాదించిన వికసిత తిరువనంతపురం విధానం నగర ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించిందని ప్రధాని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, దేశంలోని పలు రాష్ట్రాల్లో పట్టణాభివృద్ధికి చేసిన ప్రయత్నాలు ప్రజలకు నమ్మకం కలిగించాయని చెప్పారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారని వెల్లడించారు.
కాగా, దశాబ్దాలుగా కేరళ రాజకీయాలను ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటములే ఏలుతున్నాయని, వారి పాలనలో అవినీతి, హింసా సంస్కృతి పెరిగిందని ప్రధాని ఆరోపించారు. ప్రతికూల పరిస్థితులు, శత్రుత్వం, హింస ఉన్నప్పటికీ బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ప్రజల సమస్యలను లేవనెత్తారని ప్రధాని కొనియాడారు.
దేశం ముందు అన్న సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని పేర్కొంటూ ఆ పోరాటంలో కోల్పోయిన కార్యకర్తల ఆశీస్సులు రాజేశ్పై ఉన్నాయని నమ్ముతున్నట్లు మోదీ తెలిపారు. కేరళలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ మధ్య ‘ఫిక్స్‌డ్ మ్యాచ్’ నడుస్తోందని ప్రధాని ఆరోపిస్తూ ఢిల్లీలో మిత్రులుగా, కేరళలో ప్రత్యర్థులుగా నటించే ఈ రెండు కూటముల రాజకీయాలకు ప్రజలు విసిగిపోయారని స్పష్టం చేశారు.
అందుకే ఆ ఫిక్స్‌డ్ మ్యాచ్‌కు త్వరలో తెరపడనుందని ప్రధాని జోస్యం చెప్పారు. యువత, మహిళలు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. జాతీయవాదంతో కూడిన అభివృద్ధి, అవినీతి లేని పాలన, తృప్తిపరిచే విధానాలకు దూరమైన పరిపాలన కోరుకుంటున్నారని చెప్పారు.డిసెంబర్ 26వ తేదీన జరిగిన మేయర్ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, కొడుంగనూరు వార్డు కౌన్సిలర్ వీ.వి. రాజేశ్ 51 ఓట్లతో విజయం సాధించారు. బీజేపీకి చెందిన 50 మంది కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర కౌన్సిలర్ మద్దతుతో ఆయన మేయర్‌గా ఎన్నికయ్యారు. యూడీఎఫ్ అభ్యర్థి కేఎస్ సబరీనాథన్‌కు 17 ఓట్లు, ఎల్‌డీఎఫ్ అభ్యర్థి ఆర్పీ శివాజీకి 29 ఓట్లు వచ్చాయి. అదే రోజు జీఎస్ ఆశా నాథ్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
More Stories
2025లో ఓ అదృశ్య పద్మవ్యూహంలో చిక్కుకున్న భారత్!
గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం
బంగ్లాదేశ్‌లో సజీవ దహనం నుండి తప్పించుకున్న మరో హిందూ