రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియ ప్రారంభమై నేటికి 11 సంవత్సరాలు. 2015 జనవరి 2వ తేదీన నేలపాడులో పూలింగు కింద భూములు తీసుకునే ప్రక్రియను ప్రారంభించారు. తొలిరోజు కొమ్మినేని ఆదిలక్ష్మి అనే మహిళ 3.50 ఎకరాలు ఇచ్చారు. రెండో వ్యక్తిగా దామినేని శ్రీనివాసరావు 15 ఎకరాలు, ధనేకుల రామారావు 11 ఎకరాలు పూలింగు కింద ఇచ్చారు. తొలిరోజు 89 ఎకరాలు భూసమీకరణ కింద తీసుకున్నారు.
అప్పట్లో మూడేళ్లలో రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను పూర్తిగా అభివృద్ధి చేసి తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. ఐదేళ్లలో రాజధాని పూర్తవుతుందని, పరిపాలన అక్కడ నుండే ప్రారంభిస్తామనీ ప్రభుత్వం ప్రకటించింది. నేటికి సరిగ్గా 11 సంవత్సరాలు పూర్తయినా ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో సమీకరణ కింద ఇంకా భూములు తీసుకుంటున్నారు. 2,200 ఎకరాలు ఇంకా తీసుకోవాల్సి ఉంది.
అమరావతి సమీకరణ అనంతరం రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. రైతుల సమస్యలు పరిష్కారానికి నోచలేదు. వాటిని పరిశీలించేందుకు త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసినా అక్కడ ఇంకా చర్చల దశలోనే సమస్యలు ఉన్నాయి. రైతులు మాత్రం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుని వేర్వేరు పద్ధతుల్లో తమ నిరసనలు వ్యక్తం చేశారు.
2015 జనవరిలో ప్రక్రియ ప్రారంభమైతే ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఇప్పటికీ అక్కడ ప్రారంభమైంది తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక హైకోర్టు మాత్రమే. శాశ్వత నిర్మాణంగా సిఆర్డిఎ ప్రధాన కార్యాలయం మాత్రం పూర్తయింది. ఒకటీ రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ భవనాలు ప్రారంభించుకున్నాయి. సిటీ సివిల్ కోర్టు భవనాల్లోనే ఇప్పటికీ కొన్ని హైకోర్టు విభాగాలు నడుస్తున్నాయి.
మాస్టర్ప్లానులో వీధిపోటు ప్లాట్లు ఇంకా ఉన్నాయి. అలాగే గ్రామకంఠం భూముల సమస్య, జరీబు, నాన్జరీబు, అసైండ్ భూములు, చెరువు భూమిలో ప్లాట్ల కేటాయింపు వంటి సమస్యలు 11 ఏళ్ల నుండి కొనసాగుతూనే ఉన్నాయి. వెంకటపాలెం గ్రామంలో అయితే జాతీయ రహదారి భూమిలో ప్లాట్లు వచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
కరకట్టను విస్తరించి మూడేళ్లలో జాతీయ రహదారికి అనుసంధానం చేస్తామని అప్పట్లో మంత్రి నారాయణ ప్రకటన చేసినా ఇప్పటికీ అనుసంధాన పనులు జరుగుతున్నాయి. రాజధాని చట్టబద్ధత అంశం కొలిక్కి రాలేదు. ఇంకా న్యాయ పరిశీలనలోనే ఉంది. గెజిట్ వస్తుందని అనుకున్నా రాలేదు. 2019 వరకూ టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనూ వారి సమస్యలు పరిష్కారం కాలేదు.
2019 తర్వాత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానుల ప్రకటనతో రైతులు ఒక్కసారిగా కుదేలయ్యారు. వారిపై కేసులు, పనులు నిలిపేయడం వంటి చర్యలతో రాజధాని పనులు దాదాపు నిలిచిపోయాయి. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం పనులు ప్రారంభించినా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.

More Stories
తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో రంగంలోకి ఈడీ
11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్టను దిగజార్చారు