బంగ్లాదేశ్‌లో సజీవ దహనం నుండి తప్పించుకున్న మరో హిందూ

బంగ్లాదేశ్‌లో సజీవ దహనం నుండి తప్పించుకున్న మరో హిందూ
మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ లో హిందువులపై దాడులు ఆగడం లేదు తాజాగా మరో హిందూ వ్యక్తిపై మూక దాడి జరిగింది. ఈ దాడిలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.  స్థానిక మీడియా వివరాల ప్రకారం డిసెంబర్‌ 31న దేశంలోని షరియత్‌పూర్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.  బాధితుడు ఇంటికి వెళ్తుండగా నిందితులు అడ్డుకుని దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

స్థానిక మీడియా కధనం ప్రకారం ఖోకన్ చంద్ర దాస్ (50) షరియత్‌పుర్ జిల్లా, దాముద్యా ప్రాంతంలోని కోనేశ్వర్ యూనియన్, తిలోయ్ గ్రామానికి చెందినవాడు. ఖోకన్ దాస్ క్యూర్ బంగా బజార్‌లో ఒక ఫార్మసీని, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఎప్పటిలాగే పని ముగించుకుని, రోజువారీ కలెక్షన్ డబ్బులతో అతడు ఆటో రిక్షాలో ఇంటికి బయలుదేరాడు. 

దాముద్యా-షరియత్‌పుర్ రోడ్డులోని క్యూర్ భంగా బజార్ సమీపంలోకి రాగానే కొందరు దుండగులు ఆటోను అడ్డగించారు. దుండగులు ఒక్కసారిగా ఖోకన్ దాస్‌పై విరుచుకుపడ్డారు. పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేశారు. కత్తులతో నరికారు. తీవ్రంగా గాయపడిన ఖోకన్‌పై వెంటనే పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. మంటలు చెలరేగడంతో ఖోకన్ గట్టిగా ఆర్తనాదాలు చేశాడు.

ప్రాణాలను కాపాడుకునేందుకు వెంటనే పక్కనే ఉన్న చెరువులోకి దూకేశాడు. అతని కేకలు విని స్థానికులు అక్కడకు పరిగెత్తుకు వచ్చారు. జనం రావడాన్ని గమనించిన దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి ఖోకన్‌ను కాపాడారు. హుటాహుటిన అతన్ని షరియత్‌పుర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో ప్రాథమిక చికిత్స అందించారు. 

డాక్టర్ నజ్రుల్ ఇస్లాం వైద్య పరీక్షలు చేశారు. ఖోకన్ కడుపు భాగంలో తీవ్రమైన గాయం అయినట్లు గుర్తించారు. అలాగే తల వెనుక భాగం, ముఖం, చేతులపై తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రాజధాని ఢాకాకు తరలించారు.

బాధితుడి భార్య సీమా దాస్ మీడియాతో మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యారు. “నా భర్త ప్రతి రోజూ షాపులో వచ్చిన డబ్బుతో రాత్రి ఇంటికి వస్తారు. బుధవారం రాత్రి కొందరు ఆయనను అడ్డగించారు. ఆయనపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. మాకు ఈ ప్రాంతంలో శత్రువులు ఎవరూ లేరు. ఎవరితోనూ గొడవలు లేవు. అయినా నా భర్తను ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావడం లేదు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాముద్యా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ మహమ్మద్ రబియుల్ హక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాడి చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. వారు స్థానికంగా ఉండే రబ్బీ, సోహాగ్ అని తేలింది. వారిని అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దాడిలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

కాగా, బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిపై దాడి జరగడం నెల రోజుల వ్యవధిలో ఇది నాలుగో ఘటన. డిసెంబర్‌ 24న బంగ్లాదేశ్‌లోని కలిమోహర్‌ యూనియన్‌లోని హోస్సైన్‌డంగా ప్రాంతంలో 29 ఏండ్ల అమృత్‌ మండల్‌ అనే వ్యక్తిని ఓ గుంపు కొట్టి చంపిన విషయం తెలిసిందే. 
 
అంతకుముందు అంటే డిసెంబర్‌ 18వ తేదీన భాలుకాలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను ఓ గుంపు కొట్టి చంపింది. డిసెంబర్‌ 30న కూడా మైమెన్‌సింగ్‌ జిల్లాలోని ఓ వస్త్ర కర్మాగారంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న హిందూ కార్మికుడిని సహోద్యోగి కాల్చి చంపాడు. ఇలా వరుస దాడులతో బంగ్లాదేశ్‌లోని హిందువుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.