అశ్లీల, అసభ్యకర, చైల్డ్ పోర్నోగ్రఫిక్ వంటి చట్టవిరుద్ధమైన సమాచార వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందని సామాజిక మాధ్యమాలను కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసిన ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ, ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలలో ఉన్న అశ్లీల సమాచారాన్ని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. చట్టవిరుద్ధమైన సమాచార వ్యాప్తిపై తగిన చర్యలు తీసుకోకుంటే ఆయా సామాజిక మాధ్యమాలు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని కేంద్ర స్పష్టం చేసింది.
“ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం థర్డ్‌పార్టీ సమాచారాన్ని ఆయా వేదికల్లో అప్‌లోడ్, ప్రచురణ, లేదా వ్యాప్తి చేస్తే అందుకు సోషల్ మీడియా సంస్థలు సహా ఆయా ప్రచురణ వేదికలదే బాధ్యత. నిబంధనలు పాటించకుంటే ఐటీ యాక్ట్, బీఎన్‌ఎస్ సహా ఇతర చట్టాల కింద ఆయా వేదికలు, సంబంధిత సంస్థలు, వినియోగదారులకు తీవ్ర పరిణామాలు తప్పవు” అని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
అశ్లీలమైన, పిల్లలపై లైంగిక వేధింపులకు గురిచేసే, పిల్లలకు హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన ఏదైనా సమాచారాన్ని ప్రదర్శన, అప్‌లోడ్ చేయకూడదని స్పష్టం చేసింది. ఇటీవల ఆన్‌లైన్‌లో అశ్లీల సమాచార వ్యాప్తి పెరుగుదల, దాని నియంత్రణలో సామాజిక మాధ్యమాలు కఠినంగా వ్యవహరించడం లేదని గుర్తించిన కేంద్రం ఈ మేరకు వాటిని హెచ్చరించింది.
2021 ఐటీ నిబంధనల ప్రకారం బాధిత వ్యక్తి లేదా అతడి తరఫున ఎవరైనా ఫిర్యాదు చేసిన 24 గంటల్లో అందుకు సంబంధించిన చట్టవిరుద్ధమైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు తొలగించాలి లేదా నిలిపివేయాలని కేంద్రం పేర్కొంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు వారి అంతర్గత ఫ్రేమ్‌వర్క్‌లు, కంటెంట్ మోడరేషన్ పద్ధతులు, వినియోగదారు అమలు విధానాలను తక్షణమే సమీక్షించాలని ఆదేశించింది. ఇంకా IT చట్టం, IT నియమాలు 2021 ప్రకారం నిరంతర కట్టుబడి ఉండేలా చూసుకోవాలని సూచించింది.
అంతకుముందు వారం క్రితం పిల్లలు ఆన్‌లైన్‌లో అశ్లీల చిత్రాలు చూడటాన్ని అడ్డుకునేలా సాఫ్ట్‌వేర్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం సూచించింది. ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు పిల్లలు ఆన్‌లైన్‌ను చూడటాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించాలని, అప్పటివరకు ఈ విషయమై పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బాలల హక్కుల కమిషన్ వంటివి చేపట్టాలని సలహా ఇచ్చింది.

More Stories
దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ ‘పినాక’ తొలి ప్రయోగం విజయవంతం
ఆరావళిపై సుప్రీం తీర్పును స్వాగతించిన కేంద్రం
డిల్లీని కమ్మేసిన పొగమంచు- విమానాలు రద్దు, రైళ్లు ఆలస్యం