భారత రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ‘పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ (ఎల్ఆర్ జిఆర్ 120)’ తొలి గగనతల పరీక్ష సోమవారం విజయవంతంగా పూర్తయింది. ఒడిశా తీరంలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) వేదికగా జరిగిన ఈ ప్రయోగంలో, రాకెట్ అత్యంత కచ్చితత్వంతో తన లక్ష్యాన్ని ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
చాందీపూర్‌లో 120 కిలోమీటర్ల గరిష్ఠ రేంజ్లో రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి. ప్రణాళిక ప్రకారం విన్యాసాలను అమలుచేసిందని, కచ్చితత్వంతో టార్గెట్‌ను కూల్చిందని అధికారులు తెలిపారు. ఈ పినాక రాకెట్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. సుదూర లక్ష్యాలను ఛేదించే ఈ గైడెడ్ రాకెట్ల అభివృద్ధి భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని, ఇది రక్షణ రంగంలో ఒక ‘గేమ్ ఛేంజర్’ అని ఆయన కొనియాడారు.
డీఆర్డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి.కామత్ స్వయంగా ఈ ప్రయోగాన్ని వీక్షించి, మిషన్ లక్ష్యాలను సాధించిన బృంద సభ్యులను అభినందించారు. మార్గనిర్దేశక వ్యవస్థ లేని రాకెట్లకు బదులుగా, నావిగేషన్‌తో కచ్చితమైన దాడుల కోసం ‘పినాక’ రాకెట్‌ను డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఈ రాకెట్ తన గరిష్ఠ పరిధి అయిన 120 కి.మీ దూరాన్ని చేరుకోవడమే కాకుండా, ప్రయాణం మధ్యలో చేయాల్సిన అన్ని విన్యాసాలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసింది.
ప్రస్తుతం సైన్యంలో అందుబాటులో ఉన్న పినాక లాంచర్ల నుంచే దీనిని ప్రయోగించారు. దీనివల్ల ఒకే లాంచర్ ద్వారా వేర్వేరు పరిధులు కలిగిన పినాకా వేరియంట్లను ప్రయోగించే వీలు కలుగుతుందని అధికారులు చెప్పారు. డీఆర్డీఓకు చెందిన ‘ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏఆర్ డిఈ)’ ఈ రాకెట్‌ను రూపొందించింది. దీని తయారీలో హెచ్ ఈఎంఆర్ఎల్, డిఆర్ డిఏ, ఆర్ సిఐ తదితర రక్షణ ప్రయోగశాలల సహకారం కూడా ఉంది.
More Stories
ఆరావళిపై సుప్రీం తీర్పును స్వాగతించిన కేంద్రం
డిల్లీని కమ్మేసిన పొగమంచు- విమానాలు రద్దు, రైళ్లు ఆలస్యం
ఆరావళి గనుల తవ్వకంలో గత తీర్పుపై సుప్రీం స్టే