భారత్‌మాల భూసేకరణ కేసులో ఇడి దాడులు

భారత్‌మాల భూసేకరణ కేసులో ఇడి దాడులు

భారత్‌మాల ప్రాజెక్టు భూసేకరణ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సోమవారం దాడులు నిర్వహిస్తోంది.  ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, మహాసముంద్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో ఇడి సోదాలు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  రాయ్‌పూర్- విశాఖపట్నం ఆర్థిక కారిడార్‌ కోసం సేకరించిన భూమికి సంబంధించి పరిహారం చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈ సోదాలు చేపడుతున్నట్లు ఆ వర్గాలు  పేర్కొన్నాయి.  

హర్మిత్‌ సింగ్‌ ఖనుజా, ఆయన సహచరులతో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులు, భూయజమానులకు చెందిన ప్రాంగణాల్లో సోదాలు చేపడుతున్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో  ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అవినీతి నిరోధక శాఖ  (ఎసిబి)కి చెందిన ఆర్థిక నేరాల విభాగం (ఇఒడబ్ల్యు) రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

మరో రైతుకి చెందిన   రూ. 2 కోట్ల నష్టపరిహారాన్నిఅక్రమంగా తీసుకున్న  ల్యాండ్‌ బ్రోకర్‌ ఉమా తివారీ,  ఆమె భర్త కేదార్‌ తివారీని   ఎసిబి అరెస్ట్‌ చేసింది. పలువురు  రైతులకు సంబంధించిన నిధులను అక్రమంగా కొల్లగొట్టడంలో తివారీకి సహాయం చేశారనే ఆరోపణలపై హర్మీత్‌ సింగ్‌ ఖనూజాను కూడా  అరెస్టు చేసింది. 

రాయ్‌పూర్  నుండి విశాఖపట్నం వరకు 2020- 2024 మధ్య భారతమాల రహదారి ప్రాజెక్ట్‌ కారిడార్‌లో భూసేకరణ కోసం ఇచ్చిన నష్టపరిహారం నుండి రూ.32 కోట్ల అవినీతికి పాల్పడినందుకు ఈ ఏడాది అక్టోబర్‌లో 10 మందిపై  ఎసిబి  మొదటి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.  అయితే సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మార్చిలో అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తారు.