చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్న కాంగ్రెస్

చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్న కాంగ్రెస్

బంగ్లాదేశ్ చొరబాటుదారులు అస్సాం ప్రజలకు, భూమికి, సాంస్కృతిక గుర్తింపుకు ముప్పు కలిగిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ వారిని ఓటు బ్యాంకుగా పరిగణిస్తోందని  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు.  అస్సాంలోని నాగావ్ జిల్లాలోని బటద్రవ థాన్‌లో పునరాభివృద్ధి చేసిన మహాపురుష్ శ్రీమంత శంకరదేవ ఆవిర్భావ క్షేత్రాన్ని ప్రారంభించిన అనంతరం ఒక భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, అస్సాంలో, భారతదేశం అంతటా ఉన్న అక్రమ వలసదారులందరినీ గుర్తించి, వారిని తొలగించడానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

అక్రమ చొరబాటుదారుల వల్ల కలిగే ప్రమాదాలను కాంగ్రెస్ విస్మరిస్తే, అస్సాం ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి బీజేపీ కట్టుబడి ఉందని షా స్పష్టం చేశారు. ఈ చొరబాటుదారులు కేవలం ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు, వనరులకే కాకుండా, దాని విశిష్ట సాంస్కృతిక గుర్తింపుకు కూడా ముప్పు కలిగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “అస్సాం ప్రజలకు, సంస్కృతికి, గుర్తింపుకు ముప్పు కలిగించిన చొరబాటుదారులను కాంగ్రెస్ నిరంతరం ఓటు బ్యాంకుగా చూసింది,” అని షా ధ్వజమెత్తారు.

“మోదీ ప్రభుత్వం అస్సాం ప్రజల సాంస్కృతిక గుర్తింపును కాపాడటమే కాకుండా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది,” అని ఆయన తెలిపారు.  2026 అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం సిద్ధమవుతున్న తరుణంలో, హోంమంత్రి ప్రజలకు నేరుగా విజ్ఞప్తి చేస్తూ, బీజేపీకి మద్దతు కొనసాగించాలని కోరారు. “మాకు మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వండి, మేము అస్సాంను చొరబాటుదారులు లేని రాష్ట్రంగా మారుస్తాము, దాని ప్రజల భద్రత, శ్రేయస్సు, సాంస్కృతిక గర్వాన్ని నిర్ధారిస్తాము,” అని ఆయన భరోసా ఇచ్చారు. 

ప్రతిపక్ష కూటములు ఓటర్ జాబితా సరిదిద్దే ప్రయత్నాలను వ్యతిరేకించడం వల్ల కూడా రాష్ట్రంలో సమస్యల పరిష్కారం ఆలస్యం అవుతోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ అధికారం కొనసాగినప్పటికీ, సరైన అభివృద్ధి పనులు చేయలేదని హోంమంత్రి దుయ్యబట్టారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిందని, స్థానిక ప్రజల సాంస్కృతిక గుర్తింపును కాపాడటంలో చర్యలు తీసుకున్నదని ఆయన పేర్కొన్నారు.

అస్సాం రాష్ట్రంలో ముఖ్యమంత్రి హిమంతా బిస్వ శర్మ నేతృత్వంలో బంగ్లాదేశ్ చొరబాటుదారుల చేత ఆక్రమించబడ్డ లక్షకు పైగా బిఘాల భూమిని అధికారికంగా ప్రభుతం విడుదల చేసిన ఘటనను కూడా హోమ్ మంత్రి కొనియాడారు. గత 11 సంవత్సరాలలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ మిలిటెంట్ సమూహాలతో శాంతి ఒప్పందాలు సాధించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

“పదేళ్ల క్రితం అసోం ఎలా ఉందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ సమయంలో హింస, బంద్లు, హత్యలతో నిండిపోయింది. కానీ ఇప్పుడు అసోం ప్రగతి పథంలో పయనిస్తోంది. గత పదేళ్లలో ముఖ్యంగా ఐదేళ్ల హిమంత బిశ్వ శర్మ పాలనలో సుమారు 1.29లక్షల బిగాల భూమిని ఆక్రమణ దారుల నుంచి విముక్తి చేశాం. నేను కాంగ్రెస్ను ఒకటే అడగాలని అనుకుంటున్నాను. ఆక్రమణ దారుల వల్ల అసోం సంస్కృతి, భాష మనుగడ సాధిస్తుందా? అందుకే మరో ఐదేళ్లు పాలించేందుకు కమలాన్ని ఆశీర్వదించండి. అసోంలోని ప్రతీ ఆక్రమణదారుడిని బయటకు పంపిస్తాం” అని అమిత్ షా హామీ ఇచ్చారు.