బంగాల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో బిజెపి ప్రభుత్వం

బంగాల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో బిజెపి ప్రభుత్వం
బంగాల్​లో మూడింట రెండొంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. బంగాల్ ప్రజలు టీఎంసీ సహా కాంగ్రెస్​, లెఫ్ట్ పార్టీలకు బంగాల్ ప్రజలు అవకాశం ఇచ్చారని, ఈసారి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.  త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన మంగళవారం కోల్​కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొంటూ రాజకీయ హింసలో వామపక్షాలను టీఎంసీ మించిపోయిందని అమిత్ షా ఆరోపించారు.
 
బెంగాల్ లో బిజెపి క్రమంగా బలం పెంచుకుంటుందని చెబుతూ 2014 ఎన్నికల్లో 17శాతం ఓట్లు, రెండు సీట్లు వచ్చాయని, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 10శాతం ఓట్లు, కేవలం మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలిచామని, అదే 2019 లోక్​సభ ఎన్నికలకు వచ్చేసరికి  41శాతం ఓట్లు, 18 సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నిక్లల్లో ఏకంగా 38శాతం ఓట్లతో 77 స్థానాల్లో గెలిచామని చెప్పారు. 
 
“కేవలం మూడు స్థానాలు గెలిచిన పార్టీ ఐదేళ్లలో ఏకంగా 77 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్​ పుట్టిన బంగాల్​లోనే ఆ పార్టీని జీరోకు తీసుకువచ్చాం. 34 ఏళ్ల పాటు పాలించిన కమ్యూనిస్ట్​ కూటమి కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. మేము ప్రధాన ప్రతిపక్షంగా అవతరించాం. ఇక 2026 ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది”  అంటూ అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
 
బంగాల్ ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని, పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలివెళ్తున్నాయని అమిత్ షా విమర్శించారు. “మందిర్- మసీద్​ రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? టీఎంసీ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, నేతలే ఇలా చేస్తున్నారు. ఎన్నికల సమయంలో బాబ్రీ మసీద్​ను నిర్మించడం సరైందో కాదో బంగాల్​ ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి” అని స్పష్టం చేశారు. 
 
నిరుద్యోగం, అవినీతి, మహిళ భద్రత లాంటి ఎన్నో సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయని పేర్కొంటూ వీటన్నింటి నుంచి టీఎంసీ తప్పించుకునేందుకు అవకాశం లేదని అమిత్ షా తేల్చి చెప్పారు. ఈశాన్య సరిహద్దుల నుంచి వస్తున్న ఆక్రమణదారులను బీజేపీ అడ్డుకుంటుందని చెబుతూ  అధికారంలోకి వచ్చాక బంగాల్‌కు పూర్వవైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 
 
బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి బంగాల్ ప్రభుత్వం భూమిని ఇవ్వడం లేదని, అందుకే కంచె నిర్మాణాన్ని పూర్తి చేయలేకోపోతున్నామని చెప్పారు.  ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బంగ్లాదేశీయుల చొరబాట్లకు మమత సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. బంగాల్‌ ప్రజలు చొరబాట్లపై ఆందోళనగా ఉన్నారని పేర్కొంటూ అధికారంలోకి వచ్చాక చొరబాటుదారులను తరిమికొడతామని అమిత్ షా స్పష్టం చేశారు.

భారత్- బంగ్లాదేశ్​ సరిహద్దుల్లో కంచ ఏర్పాటు విషయంపై మమతా బెనర్జీకి నేను 7లేఖలు రాశానని, గత ఆరేళ్లలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి మూడు సార్లు బంగాల్​కు వచ్చి రాష్ట్ర హోం శాఖ కార్యదర్శితో సమావేశమయ్యారని ఆయన గుర్తు చేశారు. “టీఎంసీ ప్రభుత్వాన్ని ఒకటే అడగుతున్నాను? కంచె ఏర్పాటు చేయడానికి భూమి ఇచ్చేందుకు మీకున్న భయం ఏంటి? ఈ అంశంపైనా మీకు బాధ్యత లేదా? లేదా ఆక్రమణదారులు రావడం మీకు కావాలా?” అని ప్రశ్నించారు.

పైగా, ఈ ఆక్రమణదారులకు టీఎంసీ ప్రభుత్వం పత్రాలను అందిస్తోందని ఆయన ఆరోపించారు. మతువాలు భయపడాల్సిన అవసరం లేదని,  శరణార్థులుగా బంగాల్​కు వచ్చిన వారందరూ భారత పౌరులే అని హోంమంత్రి భరోసా ఇచ్చారు. మమతా బెనర్జీ సహా దేశంలో ఎవరూ వారికి హానీ తలపెట్టరని హామీ ఇచ్చారు.

“దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది. ఒకవేళ మా ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుంటే తమిళనాడు, తెలంగాణలో కూడా ఇలానే జరగాలి కదా? దేశంలోని ప్రతీ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ, కేవలం బంగాల్​లోనే ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి?” అని అమిత్ షా ప్రశ్నించారు.

“మెట్రో గాలిలో నడవదు. దానికోసం భూమి అవసరం. ఆక్రమణలు తొలగించి భూమిని ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకునే విధంగా వారి ఆలోచనలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లోని మెట్రోల్లో ఎందుకు ఎలాంటి సమస్యలు రావడం లేదు?” అని విస్మయం వ్యక్తం చేశారు.