బంగ్లాదేశ్‌లో దారుణం మరో హిందువు బలి

బంగ్లాదేశ్‌లో దారుణం మరో హిందువు బలి
 
బంగ్లాదేశ్‌లో దీపు దాస్, అమృత్ మండల్ తర్వాత మరో హిందూ వ్యక్తి బజేంద్ర బిశ్వాస్‌ (42)ను ఇస్లామిక్ మూక హత్య చేయడంతో ఢాకాలో మైనారిటీల భద్రతపై తాజా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై హింస పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. సోమవారం సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. 

తాజాగా, బిశ్వాస్‌ని సహోద్యోగి తుపాకితో కాల్చి చంపేశాడు. అయితే, ప్రమాదవశాత్తు తుపాకీ పేలిందని నిందితుడు చెప్పటం గమనార్హం. దీపు చంద్రదాస్ హత్యకు గురైన మైమెన్‌సింగ్‌లోనే ఈ దారుణం జరిగింది. అది కూడా ఓ బట్టల ఫ్యాక్టరీలో ఈ ఘోరం జరిగింది.  పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే సైల్‌హెట్ సదర్ కాదిర్‌పురకు చెందిన భజేంద్ర బిశ్వాస్ మైమెన్‌సింగ్‌లోని ఓ బట్టల ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ ఉన్నాడు. 

అదే బట్టల ఫ్యాక్టరీలో నోమన్ మియా అనే 22 ఏళ్ల యువకుడు కూడా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. డ్యూటీ సందర్బంగా ఇద్దరూ ఓ చోట కూర్చుని ఉండగా నోమన్ మియా చేతిలోని తుపాకీ పేలడంతో బుల్లెట్ బిశ్వాస్ ఎడమ తొడలోకి దూసుకెళ్లింది. దీంతో బిశ్వాస్‌కు తీవ్ర గాయమై బాగా రక్తం పోయింది. తోటి సెక్యూరిటీ గార్డులు అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. 

ఇక, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నోమాన్ మియాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  బజేంద్ర బిస్వాస్ ఫ్యాక్టరీ భద్రత కోసం నియమించబడిన  గ్రామ రక్షణ విభాగంగా పనిచేసే ఒక పారామిలిటరీ దళం అన్సార్ సభ్యుడు. అతను పవిత్ర బిస్వాస్ కుమారుడు, సిల్హెట్ సదర్‌లోని కదిర్‌పూర్ గ్రామానికి చెందినవాడు.

కాగా, డిసెంబర్ 16వ తేదీన మైమెన్‌సింగ్‌లో దీపు చంద్రదాస్ దారుణ హత్యకు గురయ్యాడు. మతోన్మాదులు ఆయనను దారుణంగా కొట్టి, కాల్చి చంపేశారు. దైవ దూషణ చేశాడంటూ వారు ఈ దాడికి పాల్పడ్డారు. అయితే, దీపు చంద్రదాస్ దైవ దూషణ చేశాడనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవటం గమనార్హం. 

ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే  రాజ్‌భరీలోని హోసయ్‌దంగ గ్రామానికి చెందిన 29 ఏళ్ల అమ్రిత్ మండల్ అలియాస్ సామ్రాట్ అనే యువకుడిని మతోన్మాదులు దారుణంగా కొట్టి చంపేశారు. దొంగతనాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఈ ఘోరానికి ఒడిగట్టారు. ఈ రెండు ఘటనల నుంచి తేరుకోక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది.