మత మార్పిడి రాకెట్లను నిర్మూలించడానికి కృత్రిమ మేధస్సు (ఏఐ), ఇతర ఆధునిక సాంకేతిక సాధనాలను ఉపయోగించాలని ఉత్తర్ప్రదేశ్ పోలీసులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. సోషల్ మీడియా, సైబర్ నేరాలపై కఠినమైన నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే లేదా కుల, మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని స్పష్టం చేశారు.
లఖ్నవూలో జరిగిన సీనియర్ పోలీసు అధికారుల సమావేశం ‘పోలీస్ మంథన్’లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ను ఆనుకుని ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల నుంచి దేశంలోకి ప్రవేశించే ఉగ్రవాద కార్యకలాపాల నెట్వర్క్ గురించి పోలీసులు, అధికారులతో సమీక్షించారు. ఈ క్రమంలో సరిహద్దు నిఘాను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని యోగి నొక్కి చెప్పారు.
వ్యవస్థీకృత మత మార్పిడి నెట్వర్క్లను అరికట్టడానికి కృత్రిమ మేధస్సు, ఆర్థిక ట్రయల్ విశ్లేషణ, సాంకేతిక పరిశీలన, ఆధునిక వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కులం, మతం ఆధారంగా సమాజాన్ని విభజించడానికి, పోలీసులపై ఒత్తిడి తీసుకురావడానికి, అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నించే శక్తుల పట్ల ఎటువంటి దయ, జాలి చూపొద్దని స్పష్టం చేశారు.
ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి సరిహద్దు భద్రత, ఉగ్రవాద నిరోధక యంత్రాంగాలను సాంకేతికంగా బలోపేతం చేయాలని ఆదిత్యనాథ్ సూచించారు. గోమాతల అక్రమ రవాణా, మత మార్పిడులలో పాల్గొన్న వ్యవస్థీకృత ముఠాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో మత మార్పిడిని తీవ్రమైన సవాల్గా అభివర్ణించారు.
బలరాంపుర్లో జరిగిన ఘటనలు వ్యవస్థీకృత ప్రయత్నాలను సూచిస్తాయని, అటువంటి సంఘటనలను ఆదిలోనే అణిచివేయాలని పోలీసులు, నిఘా సంస్థలను కోరారు. అలాగే సోషల్ మీడియా దుర్వినియోగం, తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ లు, డార్క్ వెబ్, సైబర్ నేరం, ఉగ్రవాద నెట్వర్క్లపై ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను లేదా సామాజిక సామరస్యాన్ని ప్రభావితం చేసే ఏ అభ్యంతరకరమైన కంటెంట్ పైనైనా త్వరగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
“సామాజిక వ్యతిరేక శక్తులు కొత్త సంస్థలను ఏర్పాటు చేయడానికి, సమాజంలో గందరగోళాన్నిసృష్టించడానికి ప్రముఖ వ్యక్తుల పేర్లను దుర్వినియోగం చేస్తున్నారు. ఫేక్ సోషల్ మీడియా ఖాతాలతో సమాజంలో అలజడిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి గ్రూపుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేయాలి. వాటి నెట్వర్క్లను విచ్ఛిన్నం చేయాలి. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి” అని ఆదిత్యనాథ్ ఆదేశించారు.
శాంతిభద్రతలను పునరుద్ధరించడం, సుదీర్ఘ కర్ఫ్యూలను ముగించడం, పాలనపై అవగాహనను పెంచడం ద్వారా రాష్ట్ర పురోగతి సాధ్యమైందని ఆదిత్యనాథ్ తెలిపారు. “ఉత్తర్ప్రదేశ్లో మునుపటిలా చట్టవిరుద్ధ కార్యకలాపాలు, గందరగోళం, సుదీర్ఘ కర్ఫ్యూలు కొనసాగి ఉంటే ఇటువంటి పురోగతి అసాధ్యం. నేడు ప్రతి పౌరుడు ఉత్తర్ప్రదేశ్లో పరివర్తనను అంగీకరిస్తున్నాడు. దేశంలోని 55శాతం ఎక్స్ప్రెస్ వేలు ఇప్పుడు యూపీలోనే ఉన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటానికి, మార్పును తీసుకురావడానికి బలమైన మౌలిక సదుపాయాలు కీలకం” అని యోగి చెప్పారు.
ఆధునిక సవాళ్లను ఎదుర్కోవడంలో యూపీ పోలీసుల నిబద్ధతను కొనియాడుతూ మహిళలు, పిల్లలపై నేరాలు, సైబర్ క్రైమ్, పోలీసుల నైతికత, నాలుగు లక్షల మంది పోలీసులకు మౌలిక సదుపాయాలు, విపత్తు నిర్వహణ, నిఘా, నేపాల్ సరిహద్దు భద్రత, తీవ్రవాదం, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై 2020లో ప్రారంభించిన మిషన్ శక్తి దృష్టి సారించిందని తెలిపారు.

More Stories
ప్రపంచవ్యాప్తంగా ‘హిందూ జీవన విధానం’కు ఆదర్శంగా నిలుద్దాం
ఎవరు ఎక్కువ మతోన్మాది, పెద్ద జిహాదీ అని పోటీపడుతున్నారా?
శ్రీలంకపై భారత్ వరుసగా నాలుగోసారి ఘనవిజయం