ఉన్నావ్ రేప్ కేసులో నిందితుడికి బెయిల్‌పై `సుప్రీం’ స్టే

ఉన్నావ్ రేప్ కేసులో నిందితుడికి బెయిల్‌పై `సుప్రీం’ స్టే

ఉన్నావ్ రేప్ కేసులో యూపీ ఎమ్మెల్యే కుల్దీర్ సింగ్ సెంగార్‌ కు ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బెయిల్‌పై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. 2017లో ఉన్నావ్ రేప్ ఘ‌ట‌న జ‌రిగిన విష‌యం తెలిసిందే. జీవిత‌ఖైదు శిక్ష‌ను ర‌ద్దు చేస్తూ ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను సీబీఐ స‌వాల్ చేసింది. 

హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సిబిఐ దాఖలు చేసిన అభ్యర్థన ఆధారంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం కుల్దీప్‌ సెంగార్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ప్రతిస్పందన తెలపాల్సిందిగా సెంగార్‌ను ఆదేశించింది. పోక్సో కింద పబ్లిక్‌ సర్వెంట్‌ నిర్వచనంపై సందిగ్ధత ఉందని ధర్మాసనం గమనించింది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే ప్రశ్నే లేదని కోర్టు తీవ్రంగా పేర్కొంది.

డిసెంబ‌ర్ 23వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్ర‌కారం కుల్దీప్ సెంగార్‌ను క‌స్ట‌డీ నుంచి రిలీజ్ చేయ‌రాదు అని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది. సెంగార్‌కు బెయిల్ ఇచ్చిన వైఖ‌రిని సీబీఐ త‌న పిటీష‌న్‌లో త‌ప్పుప‌ట్టింది. అయితే తాజాగా సుప్రీం ఇచ్చిన ఆదేశాల‌తో కుల్దీప్ జైలులోనే కొన‌సాగ‌నున్నారు.  కుల్దీప్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వ‌డంతో దేశ‌వ్యాప్తంగా చ‌ర్చాంశంగా మారింది. తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

రేపిస్టులకు రక్షణలు కల్పించడాన్ని ఖండిస్తూ ప్లకార్డులు, నినాదాలతో గ‌త శుక్ర‌వారం హైకోర్టు ప్రాంగణం సమీపంలో నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలికి మద్దతుగా నిర్వహించిన ఆనిరసన ప్రదర్శనలలో ఐద్వాకు చెందిన సభ్యులతోపాటు సామాజిక కార్యకర్త యోగితా భావన, బాధితురాలి తల్లి తదితరులు పాల్గొన్నారు. తన కుమార్తె చాలా కష్టాలను ఎదుర్కొందని, ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించడానికే తాను వచ్చానని బాధితురాలి తల్లి మీడియాకు తెలిపారు.