* పాక్ అధ్యక్షుడిని బంకర్లో దాక్కోమన్నారు!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ భారత సైన్యం ఆ దేశ వైమానిక దళాన్ని చావుదెబ్బ తీసింది. దాయాది దేశం కీలక వైమానిక స్థావరాలను భారత క్షిపణులు ధ్వంసం చేశాయి. అయితే ఈ నష్టంపై ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తోన్న పాక్ తాజాగా ఈ విషయాన్ని అంగీకరించింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై భారత్ జరిపిన దాడులను సంవత్సరాంతపు విలేకరుల సమావేశంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి, ఉపప్రధాని మంత్రి ఇషాక్ దార్ అంగీకరించారు.
“రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుంది. భారత్ 36 గంటల్లో 80 డ్రోన్లను పాకిస్థాన్ భూభాగంపైకి ప్రయోగించింది. మేము 79 డ్రోన్లను అడ్డుకోగలిగాం. ఒక డ్రోన్ మాత్రం నూర్ ఖాన్ వైమానిక స్థావరాన్ని దెబ్బతీసింది. అలాగే ఈ దాడిలో నూర్ ఖాన్ ఎయిర్బేస్ వద్ద ఉన్న సిబ్బంది గాయపడ్డారు” అని మీడియా సమావేశంలో ఇషాక్ దార్ వెల్లడించారు.
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ సివిల్, సైనిక నాయకత్వం మే 9 రాత్రి ఒక సమావేశం నిర్వహించిందని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్పారు. కాగా, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తమ దేశ నాయకత్వంలో భయాన్ని రేకెత్తించిందని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ స్వయంగా తెలిపారు.
మే నెలలో న్యూడిల్లీ ప్రతిదాడుల సమయంలో తన సైనిక కార్యదర్శి భద్రత కోసం తనను అత్యవసరంగా బంకర్ కు వెళ్లాలని సూచించారని ఇస్లామాబాద్లో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. “నా సైనిక కార్యదర్శి నా దగ్గరకు వచ్చి సర్ యుద్ధం ప్రారంభమైందని చెప్పారు. నిజానికి నేను నాలుగు రోజుల ముందే యుద్ధం జరుగుతుందని అతనికి చెప్పాను. కానీ ఆయన నా దగ్గరకు వచ్చి సర్ బంకర్లకు వెళ్దామన్నారు. ‘నా ప్రాణాలు పోవాలంటే ఇక్కడే పోతాయి. నాయకులు బంకర్లలో దాక్కొని చనిపోరు. యుద్ధభూమిలో చనిపోతారు’ అని నా సైనిక కార్యదర్శితో చెప్పాను” అని జర్దారీ తెలిపారు.
కాగా, నూర్ ఖాన్ ఎయిర్బేస్పై భారత్ దాడులకు పాకిస్థాన్ నాయకులు అంగీకరించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా అంగీకరించారు. భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని ధ్రువీకరించారు. మే 10 తెల్లవారుజామున రావిల్పిండిలోని నూర్ ఖాన్ సహా ఇతర వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసినట్లు వెల్లడించారు.

More Stories
భారత్ లోనే ఉస్మాన్ హాదీ హంతకులు.. ఖండించిన బిఎస్ఎఫ్
తప్పుడు మత దూషణ ఆరోపణలతో బంగ్లా హిందువులపై దాడులు
కెనడాలో భారత మహిళలకు భరోసాగా ఓ కేంద్రం!