ప్రపంచవ్యాప్తంగా హిందువులు తమ ప్రవర్తన, విలువలు, జీవనశైలితో ఆదర్శంగా నిలవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. శక్తి లేదా సంపద ఆధిపత్యం ద్వారా కాకుండా, ధర్మం, కరుణ, నిస్వార్థ సేవపై ఆధారపడిన “హిందూ జీవనం” ద్వారా ప్రపంచానికి ప్రేరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
భాగ్యనగర్ (హైదరాబాద్) సమీపంలోని కన్హా శాంతి వనంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన విశ్వ సంఘ్ శిబిర్ –2025 ముగింపు సార్వజనిక ఉత్సవంలో ప్రసంగిస్తూ నేటి ప్రపంచంలోని అనేక సంక్షోభాలకు ధర్మాన్ని పక్కన పెట్టడమే కారణమని చెప్పారు.
“ధర్మం విస్మరించబడినప్పుడు అసమతుల్యత ఏర్పడింది. అతివాదం పెరిగింది, చరిత్ర తప్పుదోవ పట్టింది, కరుణ మరచిపోయింది. అందుకే నేడు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి” అని ఆయన పేర్కొన్నారు. సమతుల్యత పునరుద్ధరణపై చర్చలు జరుగుతున్నప్పటికీ, ఆరంభం ఎవరు చేయాలి? ఎలా చేయాలి? అన్నదే అసలు ప్రశ్నగా ఆయన తెలిపారు.
కొలంబస్ నిలువగుడ్డు కథ, ‘పిల్లికి గంట కట్టేది ఎవరు?’ అనే ప్రసిద్ధ ఉపమానాలను ప్రస్తావిస్తూ, మార్పు ఆలోచనలతో మాత్రమే కాకుండా ముందడుగు వేసే వ్యక్తుల ద్వారా వస్తుందని ఆయన వివరించారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డా. కేశవ బలిరామ్ హెగ్డేవార్ జాతీయ కార్యాచరణ వ్యక్తితోనే ప్రారంభమవాలని విశ్వసించారని భగవత్ గుర్తు చేశారు.
“తమ నుంచే కార్యాచరణ ప్రారంభించే వ్యక్తులను తయారు చేయాలన్నదే ఆయన సంకల్పం. అందుకే స్వయంసేవకులు రూపొందుతారు” అని తెలిపారు.
సేవ అర్థాన్ని వివరిస్తూ, భయం, బలవంతం, ప్రతిఫల ఆశ, గుర్తింపు కోరికతో చేసే సేవకూ, నిస్వార్థంగా చేసే నిజమైన సేవకూ మధ్య తేడాను ఆయన స్పష్టం చేశారు. “సేవనే పరమ లక్ష్యంగా భావించే వారే స్వయంసేవకులు” అని చెప్పారు.
సంఘ్ విస్తరించడంతో స్వయంసేవకులు ప్రపంచమంతటా వ్యాపించినా, హిందూ సమాజ సమగ్ర అభ్యున్నతి, హిందూ ధర్మ పరిరక్షణ పట్ల తమ నిబద్ధతను మర్చిపోలేదని ఆయన పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించాల్సింది సైనిక లేదా ఆర్థిక ఆధిపత్యం ద్వారా కాకుండా, తన జీవన విధానం ద్వారా ఉదాహరణగా నిలిచి అని ఆయన స్పష్టం చేశారు.
“మనం ప్రపంచాన్ని నడిపిస్తాం, కానీ మన స్వంత పద్ధతుల్లో, మన జీవనశైలితో. ఇతరులను అణచివేయాలనే కోరిక లేదు. మా జీవన ఉదాహరణను ప్రపంచం ముందుంచుతాం” అని ఆయన చెప్పారు. హిందువులు తమ విలువలను అవగాహనతో జీవించాలని, అలా జీవించడం ద్వారా సమతుల్యత, సామరస్యంతో జీవితం ఎలా ఉండాలో ప్రపంచం నేర్చుకుంటుందని ఆయన పిలుపునిచ్చారు.సంఘం పెరుగుతూ వుంటే స్వయంసేవకులు కూడా పెరుగుతుంటారని, కొందరు స్వయంసేవకులు విదేశాలకు కూడా వెళ్లారని, కానీ వారు తమ వ్రతాన్ని మాత్రం మరిచిపోలేదని స్పష్టం చేశారు. హిందూ దేశ సర్వాంగీణ ఉన్నతిని కానీ, హిందూ ధర్మ సంరక్షణను కానీ మరిచిపోలేదని ఆయన తెలిపారు. “ఇతర దేశాల్లో వున్న వారందరూ మన మన చరిత్రను, మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మన ఆచరణ చేస్తున్న పద్ధతులను చూసి, ఎలా జీవించాలో నేర్చుకోవాలి. అలా మనం బతకాలని మన పూర్వీకులు నిర్దేశించారు. ఇలాంటి ఉదాహరణను ప్రపంచం ముందు వుంచి, ప్రపంచంలోని ప్రతి మూలనా ధర్మాన్ని ప్రతిష్ఠ చేయాలి” అని డా. భగవత్ సూచించారు.
తాముండే దేశాల ప్రజలు తమకు కూడా ఓ హిందూ స్వయంసేవక్ సంఘ్ లాంటి స్వయంసేవక్ సంఘ్ వుండాలనుకునే విధంగా మెలగాలని, అంతటి బృహత్తర బాధ్యత మీ భుజ స్కంధాలపై ఇప్పుడు పడిందని ప్రతినిధులకు డా. భగవత్ సూచించారు. ఎందుకంటే తమకు కూడా ఇలాంటి జీవన పద్ధతి వుండాలని భావించేలా. భారత్ లో ఎలాగైతే సంఘ్ కార్యం వుందో, అచ్చు అలాంటి సంఘటనే, అలాంటి జీవన విధానమే తమకు కూడా వుండాలన్న చర్చ తీవ్రమవుతోందని చెప్పారు.
“భారత్ లో వున్న స్వయంసేవకులు మాదిరిగా జీవించడానికి, వారి జీవన పద్ధతులను తమకు కూడా నేర్పిస్తారా? మాకూ శిక్షణ ఇస్తారా? అని అడుగుతున్నారు. ఈ చర్చ సాగుతోంది. అలాంటి వారికి హిందూ స్వయంసేవక్ సంఘ్ అని ఓ సంస్థ వుందని, దాని ద్వారా శిక్షణ పొందాలని మీరు వారందరికీ చెప్పాలి.’’ అని ఆయన పిలుపునిచ్చారు.
భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా భారత ప్రజాస్వామ్య ఆత్మ, నాగరికతా ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతతో కూడిన ఆవిష్కరణల అవసరంను ప్రస్తావించారు. “భారతదేశం ప్రజాస్వామ్యానికి మించినది. ఇక్కడ మీరు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, ఏ విషయంపైనైనా చర్చించవచ్చు, అయినా ధర్మంలో స్థిరంగా ఉండగలరు” అని పేర్కొన్నారు.
భారతదేశపు ప్రాచీన ఆవిష్కరణ సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ, శస్త్రచికిత్సలు, లోహ విజ్ఞానం, గోల్కొండ కోటలో కనిపించే ధ్వని ఇంజనీరింగ్, ప్రతీకాత్మక జ్ఞాన సంప్రదాయాలను గుర్తు చేశారు. వినియోగం, జీవనశైలిలో పాశ్చాత్యాన్ని అంధానుకరణ చేసే వలసకాల మానసికతపై హెచ్చరిస్తూ, స్వదేశీ జ్ఞానం, పరిష్కారాలను తిరిగి కనుగొనాలని సూచించారు.
శ్రీ రామ్ చంద్ర మిషన్ అధ్యక్షుడు, ఆధ్యాత్మిక గురువు కమలేష్ డి. పటేల్ (దాజీ) ప్రసంగిస్తూ స్థిరమైన సామాజిక మార్పుకు అంతర్గత సమతుల్యత, మనస్సు స్పష్టత, విలువాధారిత జీవనం అవసరమని తెలిపారు. శిబిర్లో 79 దేశాల నుంచి 1,610 మంది కార్యకర్తలు, స్వయంసేవకులు పాల్గొన్నారు. హిందూ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, సేవా ఇంటర్నేషనల్, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఇంటర్నేషనల్, సంస్కృత భారతి వంటి సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

More Stories
ఎవరు ఎక్కువ మతోన్మాది, పెద్ద జిహాదీ అని పోటీపడుతున్నారా?
మత మార్పిడి రాకెట్ల నిర్మూలనకు కృత్రిమ మేధస్సు
భారత్ కు ఎదురవుతున్న అతిపెద్ద ప్రమాదం వాయు కాలుష్యమే