1 నుంచి పిఓకెలో జెఇఎం శిక్షణా శిబిరం

1 నుంచి పిఓకెలో జెఇఎం శిక్షణా శిబిరం
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ (జెఇఎం) ఉగ్రవాద సంస్థ వచ్చే ఏడాది జనవరి 1 నుండి పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె)లోని మీర్‌పూర్‌లో ఏడు రోజుల ‘తర్బియా’ లేదా శిక్షణా శిబిరాన్ని నిర్వహించబోతోందని అధికార వర్గాలు తెలిపాయి.  మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ స్థాపించిన ఈ ఉగ్రవాద సంస్థ, మద్దతు కూడగట్టడానికి గర్హి హబీబుల్లా, బాలాకోట్‌లో బహిరంగ సభలను కూడా నిర్వహిస్తోంది. 
నిఘా వర్గాల ప్రకారం, ఈ ర్యాలీలకు చిన్న పిల్లలు హాజరవుతున్నారు.  ఆ తర్వాత వారిని ఉగ్రవాద సంస్థలో చేర్చుకుంటున్నారు.  మరోవంక, లష్కర్-ఎ-తైబా (ఎల్ఈటి) కూడా పిఓకెలో తన మహిళా విభాగాన్ని క్రియాశీలం చేసింది.  మహిళలను చేర్చుకునేందుకు శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ శిబిరాలకు లష్కర్‌కు చెందిన అబ్దుల్ రౌఫ్, రిజ్వాన్ హనీఫ్, అబు మూసా హాజరవుతున్నారని ఆ వర్గాలు తెలిపాయి.
 
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సాయుధ దళాలచే ధ్వంసమైన పాకిస్థాన్, పిఓకెలలోని తమ శిబిరాలను ఈ ఉగ్రవాద సంస్థ పునర్నిర్మిస్తోంది. ఈ దాడిలో ఎక్కువగా పర్యాటకులతో సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు.  పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని లోయర్ దిర్ జిల్లాలో లష్కర్ ‘జిహాద్-ఎ-అక్సా’ అనే ఉగ్రవాద శిబిరాన్ని కూడా క్రియాశీలం చేసిందని నిఘా వర్గాలు తెలిపాయి. 
జైష్ విషయానికొస్తే, ఆత్మహుతి దాడులు చేయడానికి మహిళలను నియమించుకోవడం ప్రారంభించిందని ఆ వర్గాలు గతంలో ఇండియా టీవీకి తెలిపాయి.  దీని కోసం, ఇది రావల్కోట్‌లో ‘దుఖ్తరన్-ఎ-ఇస్లాం’ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఇరాక్, సిరియా ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్), హమాస్ వంటి మహిళా బ్రిగేడ్‌ను ఏర్పాటు చేయాలని జైష్ లక్ష్యంగా పెట్టుకుందని, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మహిళలను నియమించుకుంటున్నారని వారు చెప్పారు.
 
జైష్ ప్రజలను, ముఖ్యంగా మహిళలను నియమించుకోవడానికి ‘తుఫత్ అల్-ముమినత్’ అనే ఆన్‌లైన్ శిక్షణా కోర్సును కూడా ప్రారంభించింది. దీని కోసం ఆన్‌లైన్ పద్ధతుల ద్వారా నిధులను కూడా సేకరిస్తోంది. ఈ కోర్సులో, అజార్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అతని సోదరీమణులు సాదియా అజార్ మరియు సమీరా అజార్ ప్రతిరోజూ 40 నిమిషాల పాటు తరగతులు చెబుతున్నారు. 
 
ఈ పరిణామం భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకునే వారి ప్రయత్నాలను అడ్డుకోవడానికి వారు పాకిస్థాన్, పీఓకేలలో జైష్, లష్కర్ ల అన్ని కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.