శ్రీలంకపై భారత్ వరుసగా నాలుగోసారి ఘనవిజయం

శ్రీలంకపై భారత్ వరుసగా నాలుగోసారి ఘనవిజయం
 
*10వేల పరుగుల క్లబ్​లో స్మృతి మంధాన
సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్‌ వరుసగా నాలుగో విజయం సాధించింది. ఆదివారం తిరువనంతపురం వేదికగా భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమ్‌ఇండియా.. 30 రన్స్‌ తేడాతో గెలుపొంది సిరీస్‌లో ఆధిక్యాన్ని 4-0కు పెంచుకుంది.  మ్యాచ్‌లో తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌ 20 ఓవర్లకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 221 రన్స్‌ చేసింది.
ఓపెనర్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ స్మృతి మంధాన (48 బంతుల్లో 80, 11 ఫోర్లు, 3 సిక్సర్లు) తిరిగి ఫామ్‌లోకి రాగా షెఫాలీ వర్మ (46 బంతుల్లో 79, 12 ఫోర్లు, 1 సిక్స్‌) హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీతో కదం తొక్కింది. రిచా ఘోష్‌ (16 బంతుల్లో 40 నాటౌట్‌, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ మెరుపులతో టీ20ల్లో భారత్‌.. తమ అత్యుత్తమ స్కోరును నమోదుచేసింది. ఇక ఛేదనలో లంక ధాటిగానే ఆడినా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి గురైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 రన్స్‌ చేసింది. 

కెప్టెన్‌ చమారి ఆటపట్టు (37 బంతుల్లో 52, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హాసిని పెరీరా (33), ఇమేషా దులానీ (29) రాణించారు. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ (2/24), అరుంధతి రెడ్డి (2/42)కి తలా రెండు వికెట్లు దక్కాయి. సిరీస్‌లో ఆఖరిదైన ఐదో మ్యాచ్‌ ఈనెల 30న ఇదే వేదికలో జరుగుతుంది.

ఈ మ్యాచ్‌లో స్మృతి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో కలిపి) పదివేల పరుగులు పూర్తిచేసిన నాలుగో క్రికెటర్‌గా (భారత్‌ నుంచి రెండో ప్లేయర్‌)గా రికార్డులకెక్కింది.  మహిళా క్రికెట్‌లో ఈ ఘనతను అందుకున్నవారిలో మిథాలీ రాజ్‌ (314 ఇన్నింగ్స్‌ల్లో 10,868), న్యూజిలాండ్‌ బ్యాటర్‌ సుజీ బేట్స్‌ (343 ఇన్నింగ్స్‌ల్లో 10,652), ఇంగ్లండ్‌కు చెందిన చార్లెస్‌ ఎడ్వర్డ్స్‌ (316 ఇన్నింగ్స్‌ల్లో 10,273) మంధాన కంటే ముందున్నారు.

అయితే ఈ నలుగురిలో అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నది మాత్రం స్మృతి (280 ఇన్నింగ్స్‌ల్లోనే)యే కావడం విశేషం. అలాగే ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు కొట్టిన ఆమె.. భారత్‌ తరఫున ఈ ఫార్మాట్‌లో అత్యధిక సిక్స్‌ (80)లు కొట్టిన హర్మన్‌ప్రీత్‌ రికార్డు (78)ను అధిగమించింది. ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన రికార్డుల మోత మోగిస్తోంది. వన్డే ప్రపంచకప్‌ ముందు శతకాలతో హోరెత్తించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఒకే ఏడాది అత్యధిక పరుగులతో రికార్డు నెలకొల్పింది. మూడు ఫార్మాట్లలో దూకుడైన ఆటతో చెలరేగే మంధాన 10 వేల పరుగులు పూర్తి చేసుకుంది.