పొగమంచు కారణంగా విజిబిలిటీ పడిపోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే దాదాపు 128 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అందులో 64 అరైవల్స్ కాగా, 64 డిపార్చర్స్ ఉన్నాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఎయిర్‌పోర్టుకు వచ్చే ముందు విమాన స్టేటస్‌ను చెక్‌చేసుకోవాలని సూచించింది.
విమానాల రద్దు, ప్రయాణ సమయాల్లో మార్పుల గురించి తెలుసుకోవడానికి తమ అధికారిక వెబ్‌సైట్లను తనిఖీ చేయాలని విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచించాయి. మరోవైపు పొగమంచు ప్రభావం రైలు రాకపోకలపై కూడా తీవ్రంగా కనిపించింది. న్యూదిల్లీ, ఓల్డ్ ఢిల్లీ, ఆనంద్ విహార్, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు వచ్చే 40కిపైగా రైళ్లు గంటల కొద్దీ ఆలస్యమయ్యాయి.
హౌరా న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ 5.5 గంటలకు పైగా ఆలస్యమవగా, భువనేశ్వర్ తేజస్ రాజధాని 4.5 గంటలు ఆలస్యమైంది. రాంచీ- న్యూఢిల్లీ రాజధాని నాలుగు గంటలకు పైగా ఆలస్యమైంది. వందే భారత్, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లు కూడా షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడిచాయి.
ఇదిలా ఉండగా సోమవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక ప్రమాదకరస్థాయిలో నమోదైంది. నగరంలో ఓవరాల్ ఏక్యూఐ లెవెల్స్ 402గా నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. నగరంలోని 40 ఎయిర్ మానిటరింగ్ కేంద్రాల్లోని 25 కేంద్రాల్లో ఇవాళ ఉదయం 7 గంటలకు గాలి నాణ్యత సూచిక తీవ్రమైన కేటగిరీలో నమోదైంది.
ఆదివారం రాత్రి నుంచే ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. అనేక ప్రాంతాల్లో దృశ్యమానత 50 మీటర్లకే పరిమితమవ్వగా, కొన్ని చోట్ల పూర్తిగా కనిపించని పరిస్థితి నెలకొంది. ఆనంద్ విహార్, ధౌలా కువాన్, అక్షర్ధామ్, ద్వారక, కర్తవ్య పథ్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వాహనదారులు హెడ్‌లైట్లు, పార్కింగ్ లైట్లు ఆన్ చేసి నెమ్మదిగా ప్రయాణించారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఉదయం వేళల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, రోడ్లపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది.

More Stories
ఆరావళి గనుల తవ్వకంలో గత తీర్పుపై సుప్రీం స్టే
1 నుంచి పిఓకెలో జెఇఎం శిక్షణా శిబిరం
జమ్మూలో 35 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు