ప్రధాన నిందితులు ఫైసల్ కరీం మసూద్, అలంగీర్ షేక్‌లు మేఘాలయలోని తురా నగరంలో తలదాచుకున్నట్లు గుర్తించామని అదనపు పోలీస్ కమిషనర్ నజ్రుల్ ఇస్లాం తెలిపారు. సహచరుల సాయంతో వారు హలువాఘాట్ సరిహద్దు ద్వారా మేఘాలయలోకి ప్రవేశించారని చెప్పారు. అక్కడ వారికి ‘పూర్తీ, ‘సమి’ అనే ఇద్దరు వ్యక్తులు ఆశ్రయం కల్పించారని తెలిపారు.
వారిని భారత భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు తమకు అనధికారిక సమాచారం ఉందని పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని అధికారిక, అనధికారిక మార్గాల ద్వారా భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే, వీరిద్దరు ఎప్పుడు భారత్ కు పారిపోయారనే విషయాన్ని పోలీసులు దాటవేశారు. అటు భారత అధికారులు సైతం ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
మరోవైపు బంగ్లాదేశ్ చేసిన ప్రకటనను భారత్ ఖండించింది. బంగ్లాదేశ్ పోలీసులు, అక్కడి మీడియా చేసిన ప్రకటనల్లో నిజం లేదని బీఎస్ఎఫ్ అధికారులు, మేఘాలయ పోలీసులు స్పష్టం చేశారు. అంతర్జాతీయ సరిహద్దును దాటి ఎవరూ వచ్చినట్లు ఆధారాలు లేవని సరిహద్దు భద్రతా దళం (మేఘాలయ) వెల్లడించింది.
సరిహద్దుల్లో తమ బలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయని, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పొరుగుదేశం ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడింది. ఎవరూ రాష్ట్రంలోకి రాలేదని, తాము ఎవరినీ అరెస్టు చేయలేదని మేఘాలయ పోలీసులు వెల్లడించారు. ఇవన్నీ భారత్‌పై చేస్తున్న తప్పుడు ఆరోపణలని, భారత ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేందుకు బంగ్లాదేశ్ మీడియా కల్పిత కథనాలను సృష్టిస్తోందని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేఘాలయలోని బీఎస్ఎఫ్ చీఫ్, ఇన్స్పెక్టర్ జనరల్ ఓ పి ఉపాధ్యాయ్ ఈ ఆరోపణలు నిరాధారమైనవి, తప్పుదోవ పట్టించేవని కొట్టిపారేశారు. “హలువాఘాట్ సెక్టార్ నుండి ఏ వ్యక్తి అయినా అంతర్జాతీయ సరిహద్దు దాటి మేఘాలయలోకి ప్రవేశించినట్లు సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. బీఎస్ఎఫ్ అటువంటి సంఘటనను గుర్తించలేదు, లేదా దాని గురించి ఎటువంటి నివేదికను స్వీకరించలేదు,” అని ఉపాధ్యాయ్ తెలిపారు. నిందితులు గారో హిల్స్ ప్రాంతంలో ఉన్నారనే వాదనను ధృవీకరించడానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదా ఇంటెలిజెన్స్ లేదని మేఘాలయకు చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

More Stories
భారత్ క్షిపణులు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దెబ్బతీశాన్న పాక్ ప్రధాని
తప్పుడు మత దూషణ ఆరోపణలతో బంగ్లా హిందువులపై దాడులు
కెనడాలో భారత మహిళలకు భరోసాగా ఓ కేంద్రం!